పార్వతీపురం మన్యం జిల్లాలో ఎమ్మెల్యే జోగారావుకు నూకలాడ గ్రామస్తులు వినూత్న రీతిలో స్వాగతం పలికారు. వారి అభిమానాన్ని చూసి జోగారావు ఆశ్చర్యపోయాడు. గ్రామస్తులు ఈ విధమైన ప్రేమాభిమానాలు చూపడం వెనుక అనేక కారణాలు ఉన్నాయి
Parvatipuram MLA Jogarao: పార్వతీపురం మన్యం జిల్లాలో ఎమ్మెల్యే జోగారావుకు నూకలాడ గ్రామస్తులు వినూత్న రీతిలో స్వాగతం పలికారు. వారి అభిమానాన్ని చూసి జోగారావు ఆశ్చర్యపోయాడు. గ్రామస్తులు ఈ విధమైన ప్రేమాభిమానాలు చూపడం వెనుక అనేక కారణాలు ఉన్నాయి. బలిజపేట మండలం నూకలాడ గ్రామానికి రోడ్డు లేక గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామాల్లో చాలా కాలంగా పిటిషన్లు పెట్టుకున్నా ఎవరూ కనికరించలేదు. ఎన్నికల సమయంలో మాత్రమే నేతలు వచ్చి వాగ్దానాలు ఇచ్చి వెళ్లిపోతున్నారు తప్పించి సమస్యకు పరిష్కారం చూపలేదు. కాగా, తాజాగా పార్వతీపురం ఎమ్మెల్యే జోగారావు ప్రత్యేక శ్రద్ద తీసుకొని నూకలాడ గ్రామానికి బీటీ రోడ్డు వేయించాడు.
40 ఏళ్లుగా చేస్తున్న పోరాటానికి ఫలితం రావడంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు. రోడ్డు ప్రారంభించేందుకు గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యే జోగారావును గ్రామం పొలిమేర నుంచి పల్లకిలో ఊరేగిస్తూ గ్రామానికి తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులంతా పాల్గొన్నారు. గత నలభై ఏళ్లుగా అనేక ఇబ్బందులు పడుతున్నామని, రోగం వస్తే ఆసుపత్రికి వెళ్లాలంటే ఇబ్బందికరంగా మారిందని, చుట్టాలు పక్కాలు గ్రామానికి రావాలంటే భయపడుతున్నారని, రోడ్లు లేకపోవడంతో అరకొర ప్రయాణసౌకర్యాలతో బతుకులు ఈడ్చుకొస్తున్నామని గ్రామస్తులు తెలిపారు. తమ విజ్ఞప్తి మన్నించి రోడ్డు వేయించిన ఎమ్మెల్యే జోగారావును తమకు తోచిన విధంగా సత్కరించి కృతజ్ఞతలు తెలుపుకున్నామని నూకలాడ గ్రామస్తులు తెలియజేశారు. వైసీపీ సర్కార్ ప్రజాసంక్షేమాలకు పెద్దపీట వేస్తోందని, దీనికో ఉదాహరణ నూకలాడ గ్రామంలో రోడ్డు నిర్మాణం చేయడమేనని వైసీపీ నేతలు చెబుతున్నారు. జోగారావు చేసిన మంచి పనిని గ్రామస్తులు వేనోళ్ల పొగుడుతున్నారు. తన పరిధిలోని అంశం కావడంతో తాను పరిష్కరించానని జోగారావు చెబుతున్నారు.