తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఉత్తరాంధ్ర పై గురి పెట్టారు.
Chandra Babu Tour: తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఉత్తరాంధ్ర పై గురి పెట్టారు. ఈ రోజు నుంచి మూడు రోజులు ఉత్తరాంధ్రలో పర్యటించనున్నారు. ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమంలో పాల్గొంటారు. తిరిగి అధికారం దక్కించుకోవటమే లక్ష్యంగా చంద్రబాబు కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల పేరుతో ఉత్తరాంధ్రలో మైలేజ్ సాధించే ప్రయత్నం చేస్తోంది. ఈ సమయంలో చంద్రబాబు టీడీపీ అభివృద్ధి వాదన తో ముందుకు వెళ్తున్నారు. ఇప్పుడు జనసేనతో పొత్తు సమయంలో చంద్రబాబు చేసే ప్రసంగాలపైన ఉత్కంఠ కొనసాగుతోంది.
చంద్రబాబు ఈ మధ్యాహ్నం చంద్రబాబు విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి సాయంత్రం పెందుర్తి సమీపంలో ని మహిళా ప్రాంగణం వద్దకు చేరుకుని పంచ గ్రామాల సమస్యపై వినతిపత్రాలు స్వీకరిస్తారు. ఐదు గంటలకు మహిళా ప్రాంగణం జంక్షన్ నుంచి రోడ్ షో ప్రారంభమవుతుంది. పెందుర్తి జంక్షన్లో బహిరంగ సభలో పాల్గొంటా రు. సభ ముగిసిన అనంతరం సరిపల్లి వద్ద బస్సులో బస చేస్తారు. 18వ తేదీ ఉదయం బస్సు వద్ద టిడ్కో ఇళ్ల లబ్ధిదారుల నుంచి వినతులు స్వీకరించి న అనంతరం స్థానిక నేతలతో మాట్లాడతారు. మధ్యాహ్నం 12 గంటలకు మత్స్యకారులతో సమావేశం అవుతారు. 3.30 గంటలకు అక్కడ నుంచి బయలుదేరి ఎస్.కోట వెళతారు. అక్కడ రోడ్‌షో, అనంతరం బహిరంగ సభల్లో పాల్గొన్న అనంతరం ఆరోజు రాత్రి స్థానిక రిసార్ట్‌లో బస చేస్తారు.
19వ తేదీ మధ్యాహ్నం 3.30 గంటలకు రిసార్ట్స్ నుంచి బయలుదేరి సాయంత్రం 4.30 గంటలకు అనకాపల్లి సమీపంలోని శంకరం జంక్షన్‌కు చేరుకుంటారు. అక్కడ నల్లబెల్లం రైతుల నుంచి వినతిపత్రం స్వీకరిస్తారు. అనంతరం రోడ్‌షో నిర్వహిస్తారు. నాలుగురోడ్ల కూడలి మీదుగా 6.30 గంటలకు నెహ్రూచౌక్‌కు చేరుకుని అ బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగిస్తారు.జనసేన అధినేత పవన్ వచ్చే ఎన్నికల్లో టీడీపీ, బీజేపీతో పొత్తు పైన ప్రతిపాదన చేసిన తరువాత చంద్రబాబు పర్యటన పైన ఆసక్తి నెలకొంది. పవన్ పొత్తు ప్రతిపాదన చేసిన తరువాత చంద్రబాబు ఈ పర్యటనలోనే తమ వైఖరి పైన స్పష్టత ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఉత్తరాంధ్రలో ప్రత్యేకించి విశాఖలో ఇప్పుడు వైసీపీ పరిపాలనా రాజధాని పేరుతో సెంటిమెంట్ రాజకీయం చేస్తోంది.టీడీపీ అమారవతిలోనే రాజధాని కి కట్టుబడి ఉంది. విశాఖ లో సెప్టెంబర్ నుంచి కాపురం పెడతానంటూ ముఖ్యమంత్రి ఇప్పటికే ప్రకటన చేసారు.
విశాఖ రాజధాని ప్రభావం వచ్చే ఎన్నికల్లో పడకుండా గతంలో తమ పాలనలో ఉత్తరాంధ్రలో జరిగిన అభివృద్ధి..భవిష్యత్ ప్రణాళికలను వివరిస్తూ చంద్రబాబు పర్యటన కొనసాగనుంది. కొద్ది నెలల క్రితం జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సాధించిన విజయం తో టీడీపీలో జోష్ పెరిగింది. దీనిని కొనసాగించేందుకు చంద్రబాబు తాజా పర్యటనను సద్వినియోగం చేసుకొనే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో టీడీపీ హయాంలో నిర్ణయించిన భోగాపురం విమానాశ్రయం, ఆదానీ డేటా సెంటర్ ఏర్పాటులో చోటు చేసుకున్న పరిణామాలను చంద్రబాబు వివరించే అవకాశం ఉంది. అదే సమయంలో జనసేనాని పవన్ సైతం ఉత్తరాంధ్రలో ప్రత్యకంగా ఫోకస్ చేసారు. శ్రీకాకుళంలో యువత కోసం సభ నిర్వహించారు. గతంలో ఉద్దానం కిడ్నీ బాధితుల తరపున నిలబడ్డారు. ఇప్పుడు చంద్రబాబు పర్యటన వేళ పొత్తులతో పాటుగా అభివృద్ధి పైన ప్రధానంగా ఫోకస్ చేస్తూ చంద్రబాబు ప్రసంగాలు కొనసాగే అవకాశం కనిపిస్తోంది.