Kesineni Nani: తెలుగు దేశం ఎంపీ కేశినేని స్వరం మారుతోంది. వైఎస్సార్సీపీ నేతలను అభినందిస్తున్నారు. విజయవాడ ఎవరు అభివృద్ధి చేస్తే వాళ్లతో కలుస్తానంటూ కొత్త చర్చకు తెర తీసారు. ఎన్నికల్లో టికెట్ వస్తుందా రాదా అనే భయం తనకు లేదని చెబుతున్నారు. రెండోసారి ఎంపీగా గెలిచిన తరువాత బెజవాడ కేంద్రంగా చోటు చేసుకున్న తెలుగు దేశం రాజకీయాలతో కేశినేని నాని నిర్ణయాలు కీలకంగా మారుతున్నాయి. కేశినేని నాని గతంలో చేసిన వ్యాఖ్యలు…వ్యవహార శైలి పైన సొంత పార్టీ నుంచే విమర్శలు ఉన్నాయి. టీడీపీలో కొనసాగుతారా లేదా అనే చర్చ కూడా తెర మీదకు వచ్చింది. తిరిగి ఇప్పుడు ప్రత్యర్ధి పార్టీలను అభినందించటం పైన టీడీపీలో మళ్లీ అనుమానాలు మొదలయ్యాయి.
కేశినేని నాని వరుసగా రెండు సార్లు విజయవాడ నుంచి టీడీపీ ఎంపీగా గెలుపొందారు. 2019 లో టీడీపీ నుంచి ముగ్గురు ఎంపీలే గెలుపొందారు. కేశినేని ఆ ఎన్నికల సమయంలో పార్టీలో చోటు చేసుకున్న పరిణామాల పైన ఆ తరువాత చాలా కాలం అసంతృప్తిగానే ఉన్నారు. పార్టీ అధికారంలో ఉన్న సమయంలోనే నాడు రవాణా శాఖ నిర్ణయాలతో బస్సుల వ్యాపారం నుంచి తప్పుకున్నారు. 2019 ఎన్నికల్లో తన పార్లమెంటరీ పరిధిలో పార్టీ నేతలే తనకు వ్యతిరేకంగా పని చేసారనే అభిప్రాయం నానిలో ఉంది. మాజీ మంత్రి దేవినేని ఉమా, విజయవాడ నగర పార్టీ నేతల పైన కేశినేని కొంత కాలంగా గుర్రుగా ఉన్నారు. తన సోదరుడు చిన్నితో కుటుంబ పరంగా వచ్చిన విభేదాలను వారు తనకు వ్యతిరేకంగా తమకు అనుకూలంగా మలచు కుంటున్నారనేది నాని అభిప్రాయం.
పార్టీలో చోటు చేసుకున్న పరిణామాలతో వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి కేశినేని నాని పోటీ చేయరనే ప్రచారం మొదలైంది. పార్టీలో తనకు వ్యతిరేకంగా తన సోదరుడిని ప్రోత్సహిస్తున్నారనే అభిప్రాయం ఆయన మాటల్లో కనిపించింది. కేశినేని చిన్ని కూడా పరక్షంగా నాని పైన పలు విమర్శలు చేసారు. కేశినేని నాని పార్ట అధినేత చంద్రబాబు ఢిల్లీకి వచ్చిన సమయంలో వినామాశ్రయంలో అసహనంగా కనిపించారు. ఆయన వ్యవహార శైలి పైన పెద్ద ఎత్తున చర్చ సాగింది. ఆ తరువాత చంద్రబాబుతో మాత్రం సఖ్యత కొనసాగింది. విజయవాడ పార్లమెంటరీ పరిధిలోని టీడీపీ రాజకీయాల్లో కేశినేని నాని తన రూటే సపరేటు అన్నట్లుగా ముందుకు వెళ్తున్నానరు. దేవినేని ఉమాకు వ్యతిరేకంగా మైలవరం ఎమ్మెల్యే వసంత క్రిష్ణ ప్రసాద్ ను టీడీపీలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేసారనే ప్రచారమూ సాగింది.
తాజాగా కేశినేని నాని నందిగామ నియోజకవర్గంలో పర్యటించారు. స్థానిక వైసీపీ ఎమ్మెల్యే జగన్మోహనరావుతో కలిసి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆ సమయంలో వైసీపీ ఎమ్మెల్యేపైన ప్రశంసలు గుప్పించారు. ఇది స్థానికంగా ఉన్న టీడీపీ నేతలకు రుచించ లేదు. దీని పైన సొంత పార్టీ నుంచే భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. దీని పైన కేశినేని నాని మరోసారి స్పందించారు. నాలుగేళ్ల క్రితం మొండి తోక బ్రదర్స్ గురించి చెడుగా విన్నానని చెప్పారు. నాలుగేళ్లుగా నియోజక అభివృద్ధి కోసం తనతో మాట్లాడుతున్నారని వివరిం చారు. మంచి పనులు చేస్తున్నారు కాబట్టి వాళ్లను ప్రశంసించానని పేర్కొన్నారు. మొండి తోక బ్రదర్స్ తనకు పార్ట్ నర్స్ కాదన్నారు. తనకు టికెట్ వస్తుందా రాదా అనే భయం తనకు లేదన్నారు. టికెట్ రాకుంటే కేశినేని భవన్ లో కూర్చొని సేవా కార్యక్రమాలు కొనసాగిస్తానని వెల్లడించారు.
కేశినేని మాట తీరులో స్పష్టమైన మార్పు కనిపిస్తోందని పార్టీలో చర్చ సాగుతోంది. కొంత కాలం క్రితం నాని తీరు పైన సందేహాలు వ్యక్తం అయినా ఆ తరువాత ఆయన శైలిలో మార్పు కనిపించింది. అంతా సెట్ అయిందని భావిస్తున్న సమయంలో తిరిగి తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలో ఇప్పుడు కేశినేని రాజకీయ ఆలోచనలు మారుతున్నాయా అనే సందేహాలకు అవకాశం ఏర్పడుతోంది. విజయవాడ కేంద్రం గా ఇప్పుడు టీడీపీలో ఇదే చర్చగా మారుతోంది. ఈ పరిణామాలపై టీడీపీ నాయకత్వం స్పందన ఏంటో చూడాలి.