నెట్‌కోసం కోనసీమ టెకీల తంటాలు… గోదావరి ఒడ్డున…
ఆంధ్రప్రదేశ్‌లో కోనసీమకు ప్రత్యేకమైన గుర్తింపు ఉన్నది. గోదావరినదీ పరివాహ ప్రాంతం కావడంతో నిత్యం పచ్చని పంటపొలాలు దర్శనం ఇస్తుంటాయి. కొబ్బరి తోటలకు కొదవలేదు. ఇక గోదావరితో పాటు సముద్రతీరప్రాంతం కూడా ఉండటంతో మత్స్యపరిశ్రమలతో కళకళలాడుతుంది కోనసీమ. తాజాగా ఏపీ ప్రభుత్వం కోనసీమ ప్రాంతాన్ని జిల్లాగా మార్చింది. అమలాపురం కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేసింది. అయితే, కోనసీమ జిల్లా పేరును బీఆర్ అంబేద్కర్ కోనసీమగా మార్చాలని నిర్ణయించడంతో ఒక్కసారిగా ఈ ప్రాంతం భగ్గుమన్నది. జిల్లా పేరును మార్చవద్దని పెద్ద ఎత్తున ప్రజలు ఉద్యమించారు. అమలాపురం రణరంగంగా మారిపోయింది. దీంతో ప్రభుత్వం భద్రతా కారణాల దృష్ట్యా 144 సెక్షన్ విధించి ఇంటర్నెట్‌ను నిలిపివేసింది. ప్రభుత్వం ఇంటర్నెట్‌ను నిలిపివేయడంతో అమలాపురం పరిసర ప్రాంతాల్లోని టెకీలు అనేక ఇబ్బందులు పడుతున్నారు.
కరోనా కారణంగా గత రెండేళ్లుగా ఇంటి నుంచే పనిచేస్తున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఇంటర్నెట్ కోసం జిల్లా సరిహద్దుల వరకు వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. కోనసీమ జిల్లాలోని అయినపల్లి మండలం ముక్తేశ్వరం గౌతమి గోదావరి రేవు వద్ద ఇంటర్నెట్ వస్తుందని తెలియడంతో జిల్లాలోని పలువురు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు ల్యాప్‌ట్యాప్, మొబైల్ ఫోన్లు పట్టుకొని వెళ్లి రేవు ఒడ్డున కూర్చొని తమ విధులు నిర్వహిస్తున్నారు.