నవనీత్ కౌర్ అరెస్ట్… సర్వత్రా హైటెన్షన్?
హనుమాన్ చాలీసా వివాదం ఇప్పుడు ముంబైలో హైటెన్షన్ వాతావరణానికి తెర తీసింది. హనుమాన్ జయంతి సందర్భంగా మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే హనుమాన్ చాలీసా పఠించాలని, లేకపోతే తామే సీఎం ఇంటి ఎదుట హనుమాన్ చాలీసా పఠిస్తామని ఎంపీ నవనీత్ కౌర్ రాణా, ఆమె భర్త రవి రాణాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నవనీత్ కౌర్ ఇంటి ముట్టడికి శివసేన శ్రేణులు యత్నించగా ఈ క్రమంలో నవనీత్ కౌర్ దంపతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తరువాత నవనీత్ కౌర్ దంపతులను ఖార్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీసుల చర్యపై నవనీత్ కౌర్ దంపతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం నివాసం ముందు ఇటువంటి కార్యక్రమాలకు అనుమతి లేదని పోలీసులు వారికి సర్దిచెప్పే యత్నం చేసినా వారు వినలేదు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లో నవనీత్ కౌర్ దంపతులు తమ ఇంటి ముట్టడికి యత్నించిన శివసేనపై కేసు నమోదు చేయాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులో శివసేన చీఫ్‌గా ఉన్న సీఎం ఉద్ధవ్ ఠాక్రే, ఆ పార్టీకి చెందిన అనిల్ పరబ్, సంజయ్ రౌత్ సహా శివసేనకు చెందిన 700 మంది కార్యకర్తలపై కేసు నమోదు చేయాలని వారు పోలీసులను కోరారు.