సింగరేణిపై కేసీఆర్ దుష్ప్రచారం చేస్తున్నారు: బండి సంజయ్
తెలంగాణ సీఎం కేసీఆర్‌పై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ కేంద్ర ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం సింగరేణిని ప్రైవేటీకరణ చేయాలని చూస్తుందని కేసీఆర్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. సింగరేణిపై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి రాసిన లేఖను చూపించిన బండి సంజయ్.. సింగరేణి ప్రైవేటీకరణ అసాధ్యమన్నారు. సింగరేణి కార్మికులు టీఆర్‌ఎస్ మాటలు నమ్మొద్దని, ఇదంతా టీఆర్‌ఎస్ దుష్ప్రచారమేనని స్పష్టం చేశారు.
సింగరేణిలో మెజారిటీ వాటా రాష్ట్ర ప్రభుత్వానిదే అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం లేకుండా సింగరేణి సంస్థ ప్రైవేటీకరణ సాధ్యంకాదన్నారు. ముఖ్యమంత్రి పూటకో మాట మాట్లాడుతూ ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారన్నారు. కేసీఆర్ రైతులను, విద్యార్థులను, కార్మికులను మోసం చేస్తున్నారని విమర్శించారు. ధాన్యం సేకరణ విషయంలో రైతులను మోసం చేసిన సీఎం.. తన తప్పులను కేంద్రంపై వేస్తున్నారన్నారు. రాష్ట్రంలో నల్ల బంగారానికి పుట్టినిళ్లు అయిన సింగరేణిని కేంద్రం ప్రైవేటీకరణ చేయాలని చూస్తుందంటూ కేసీఆర్ కేంద్రంపై విష ప్రచారానికి తేరతీసారని విమర్శించారు బండి సంజయ్.