IPL: పోరాడి ఓడిన కోల్‌కతా..పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి గుజరాత్
ఐపీఎల్ 2022లో గుజరాత్ టైటాన్స్ వరుస విజయాలతో దూసుకుపోతుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గుజరాత్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. 157 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 148 పరుగులే చేయగలిగింది. ఎనిమిది పరుగుల తేడాతో ఐపీఎల్‌లో ఆరో విజయాన్ని సొంతం చేసుకుంది గుజరాత్ టైటాన్స్. దీంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది హార్దిక్ సేన.
గుజరాత్ నిర్దేశించిన 157 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు ఓపెనర్లు సింగిల్ డిజిట్ స్కోర్ కే పెవిలియన్ బాట పట్టారు. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ 12,నితీష్ రాణా 2 కూడా వెంటనే అవుటవ్వడంతో 30 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది కోల్ కతా. కోల్‌కతా కొత్త ప్లేయర్ రింకూ సింగ్ 35 పరుగులు,వెంకటేశ్ అయ్యర్ 17 పరుగులు చేసి వికెట్ల పతనాన్ని కాసేపు అడ్డుకున్నారు. ఆఖరి ఓవర్లో కోల్‌కతా విజయానికి 18 పరుగులు కావాల్సి ఉండగా స్ట్రెయిక్ ఎండ్‌లో ఉన్న రసెల్ మొదటి బంతిని సిక్స్‌గా మలచగా.. రెండో బంతికి భారీ షాట్ ఆడి అవుటయ్యాడు. దీంతో కోల్ కతా ఆశలు ఆవిరయ్యాయి.