జోమాటో కొత్త ప్రయోగం.. వామ్మో అంటున్న రెస్టారెంట్ యజమానులు!
జొమాటో, స్విగ్గీ లాంటి సంస్థలు వచ్చాక మనుషులలో బద్ధకం మరింత పెరిగింది అనేవాళ్ళు కొందరు ఉంటే బిజీ లైఫ్ లో అడుగు బయట పెట్టకుండానే ఇంటికి భోజనం తీసుకువస్తున్నారని అనే వాళ్ళు మరికొందరు. అయితే ఇలా డెలివరీ తీసుకువచ్చే డెలివరీ బాయ్స్ కొన్ని సందర్భాలలో వాటిలోని ఆహారం తింటూ కెమెరాకు చిక్కిన సందర్భాలున్నాయి. దీంతో వాళ్లు తీసుకొచ్చిన ఆహార పదార్థాలు ఎంతవరకు సేఫ్ అనే విషయం మీద ఎప్పటికప్పుడు చర్చ జరుగుతూనే ఉంటుంది. అలాగే కొన్ని రెస్టారెంట్లు నాసిరకం ఫుడ్ ప్యాక్ చేసి పంపిస్తున్నారు అంటూ కూడా జొమాటో సంస్థకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ క్రమంలోనే తమ కస్టమర్లకు నాణ్యమైన ఆహారం అందించాలనే ఉద్దేశంతో కొత్త నిబంధన తీసుకువచ్చింది. అదేమిటి అంటే ఒక రెస్టారెంట్ మీద ఎక్కువ ఫిర్యాదులు గనుక వస్తే దానిని తమ యాప్ నుంచి తాత్కాలికంగా నిషేధించనున్నారు. ఒకవేళ ఎవరైనా కస్టమర్ జొమాటోకు రెస్టారెంట్ గురించి ఫిర్యాదు చేస్తే జొమాటో ఒక థర్డ్ పార్టీ సంస్థ ద్వారా రెస్టారెంట్ లో తనిఖీలు నిర్వహిస్తుంది. ఆ తర్వాత వినియోగదారులు చేసిన కంప్లైంట్ నిజమని తేలితే శాశ్వతంగా తమ సంస్థ నుంచి నిషేధం విధించనున్నారు. అయితే ఇలా ఒక థర్డ్ పార్టీ సంస్థ వచ్చి తనిఖీ చేసేందుకు అయ్యే ఖర్చు కూడా రెస్టారెంట్ భరించాలని రెస్టారెంట్లకు సంస్థ లేఖ రాసింది. ఈ కొత్త రూల్ 18వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. అయితే దీని మీద రెస్టారెంట్ యజమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.