Shivaratri: ఈ ఏడు మహా శివరాత్రి ప్రత్యేకత ఏమిటో తెలుసా?
What is the Speciality of this Shiva ratri
భారతీయులు ఎంతో విశిష్టంగా భావించే పండుగల్లో మహాశివరాత్రి ఒకటి. ప్రతి ఏటా మాఘ బహుళ చతుర్ధశి రోజున శివరాత్రి జరుపుకుంటారు. మహాశివరాత్రి రోజును పరమ పవిత్రంగా భావిస్తారు. ప్రత్యేక పూజలు చేస్తారు. శివరాత్రి రోజున ఉపవాసం ఉండడం, జాగారం చేయడం వంటివి కోట్లాది మంది భక్తులు చేస్తారు. అలా చేయడం ద్వారా పాపాలు తొలగిపోతాయని, పుణ్యం సిద్ధిస్తుందని భక్తుల విశ్వాసం. తెల్లవారుజామునే లేచి తలస్నానం చేసి శివుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. శివరాత్రి రోజున దేశ వ్యాప్తంగా ఉన్న శివాలయాలు కిటకిటలాడతాయి. భక్తుల రద్దీ విపరీతంగా ఉంటుంది.
శివరాత్రి రోజున అన్ని శివాలయాల్లోను ప్రత్యేక పూజలు జరుపుతారు. ఆ రోజున దేవాలయాలు రాత్రి పూట కూడా తెరచే ఉంచుతారు. లింగాష్టకం, శివ పంచాక్షరి మంత్రాలను భక్తులు జపిస్తారు. రుద్రాభిషేకం చేస్తారు. భక్తి పారవశ్యంతో పరమేశ్వరుడిని ప్రార్ధిస్థారు. చాలా మంది భక్తులు రాత్రి జాగారం కూడా చేస్తారు. భగవంతుడి ప్రార్ధనలో రోజంతా మునిగి ఉండడంతో పాటు ఎటువంటి తప్పులు చేయకుండా ఉండేందుకు ప్రయత్నిస్తారు.
శివరాత్రి రోజున ప్రత్యేక పూజలు చేస్తే పాపాల్నీ తొలగిపోతాయని నమ్మకంతో అనేక మంది ప్రజలు ఆ రోజున భక్తులుగా మారిపోతారు. ఏడాదిలో ఒక్కసారి కూడా శివనామం జపించనివారు, శివాలయాలకు వెళ్లని వాళ్లు సైతం ప్రత్యేక పూజలు చేస్తారు. తాము చేసిన పాపాలను కడిగేసుకోవాలని భావిస్తారు. శివుడిని ప్రసన్నం చేసుకోవాలని ప్రయత్నం చేస్తారు.
ఒకేసారి శివరాత్రి, శనిత్రయోదశి
మన దేశంలో శివాలయాలు కొత్తశోభను సంతరించుకున్నాయి. శివరాత్రి వేడుకలకు సిద్ధమయ్యాయి. విద్యుత్ కాంతులతో ధగధగ మెరిసిపోతున్నాయి. ఈ సారి శివరాత్రికి ఓ ప్రత్యేకత ఉంది. శివరాత్రి రోజునే శనిత్రయోదశి కూడా రావడం విశేషం. దాదాపు 114 సంవత్సరాలకు ఒకసారి శివరాత్రి, శనిత్రయోదశి కలిసి వస్తాయని జ్యోతిష్యులు చెబుతున్నారు.
అరుదుగా వచ్చే ఇటువంటి రోజున ముందుగా శని దేవుడికి పూజ చేయాలని..ఆ తర్వాతే శివుడి పూజ చేయాలని పలువురు జ్యోతిష్యులు చెబుతున్నారు. శనిదోషం ఉన్నవాళ్లు తమకు మంచి జరగాలని అనేక పనులు చేస్తారు. జాతకంలో శని దోషం ఉన్నవ్యక్తులు ప్రతి శనివారం శనీశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేస్తారు. నల్ల వస్త్రాలు, నల్ల నువ్వులు దానం చేస్తారు. వాటితో పాటు కాకికి నల్ల బెల్లం పెడతారు. అవే పనులు శనిత్రయోదశినాడు చేస్తే మరింత ఎక్కువ ఫలితం వస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.
బిల్వ దళాలతో శనీశ్వరుని పూజిస్తే శుభాలను అనుగ్రహిస్తాడని భక్తుల నమ్మకం. అందుకే బిల్వ దళాలతో శనీశ్వరుడిని పూజిస్తారు. అరుదైన ఈ శివ రాత్రి రోజున మొదట శని దేవుడిని దర్శించుకున్న తర్వాతనే శివుడి దర్శనం చేసుకోవాలని పలువురు జ్యోతిష్యులు సూచిస్తున్నారు.
శివరాత్రి ఘనంగా జరిగే ప్రాంతాలివే
వారణాసి, గౌహతి, హరిద్వార్, శ్రీశైలం, శ్రీకాళహస్తి, హిమాచల్ ప్రదేశ్లోని మాండీ, శిబిసాగర్, ఖుజరహో, ఉజ్జెయిని, పూరి, నాసిక్ తదితర ప్రాంతాల్లో శివరాత్రి వేడుకలు అత్యంత ఘనంగా జరుగుతాయి. శివరాత్రిని ఎంతో ఘనంగా నిర్వహించే ఈ ప్రాంతాలకు ప్రతి ఏటా కోట్లాది మంది భక్తులు వస్తుంటారు. తన్మయంతో శివరాత్రి వేడుకల్లో పాల్గొంటారు.