ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఆ ఆర్టీసీ బస్సుల్లో 25 శాతం ఛార్జీల తగ్గింపు
ఇప్పటికే రకరకాల పేర్లతో టికెట్ ధరలు పెంచి సామాన్యులకు టెన్షన్ గా మారిన టీఎస్ ఆర్టీసీ తాజాగా ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. అదేమిటంటే స్పెషల్ బస్సుల్లో అదనపు బాదుడు సగానికి తగ్గించింది. వేసవి సెలవులు, పండుగ సమయాల్లో నడిపే స్పెషల్ బస్సులకు గాను ఆర్టీసీ ఇప్పటివరకు 50 శాతం అదనంగా ఛార్జీలు వసూలు చేసేది. కానీ ఇక నుంచి ఆ ఛార్జీలను 25శాతం మాత్రమే వసూలు చేయాలని ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు. నిజానికి పండుగలు, జాతరలు, వీకెండ్‌లలో ఏర్పాటు చేసే ప్రత్యేక బస్సుల్లో ఎప్పటి నుంచో అదనంగా 50 శాతం చార్జీలు వసూలు చేస్తున్నారు. దీంతో ఆ సమయంలో ప్రయాణం చేసేవారికి ఆర్థికంగా భారమవుతోందని అనేక విజ్ఞప్తులు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. వేసవి సెలవుల సందర్భంగా ప్రయాణికుల రద్దీ విపరీతంగా ఉంటుంది. దీంతో అదనపు ఛార్జీ 50 శాతం నుంచి 25 శాతానికి తగ్గించడం ద్వారా ప్రయాణికులకు మరింత చేరువయ్యే అవకాశం ఉందని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ భావించి అధికారులతో చర్చించి అదనపు వసూలును తగ్గించాలని నిర్ణయించారని అంటున్నారు.