ప్రారంభించి రైలెక్కిన మంత్రి.. వెంటనే పట్టాలు తప్పి?
ప్రారంభించిన కొద్ది సేపటికి ట్రైన్ పట్టాలు తప్పితే ఎలా ఉంటుంది? అది కూడా ప్రారంభించిన మంత్రి ఆ రైల్లో ఉండగానే. సరిగ్గా అలాంటి ఘటనే కర్ణాటకలో జరిగింది. కానీ అది చిల్డ్రన్ ట్రైన్. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగ లేదు. ఘటన జరిగిన సమయంలో రైలులో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి సహా కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి జగదీష్ శెట్టర్ ఉన్నారని తెలుస్తోంది. కర్ణాటక హుబ్లీ లోని ఇందిరా గాంధీ గ్లాస్ హౌస్ గార్డెన్లో శనివారం.. పిల్లల రైలు ప్రారంభోత్సవం సందర్భంగా ఈ ఘటన జరిగింది. రైలు పట్టాలు తప్పడం పై మంత్రి ప్రహ్లాద్ జోషి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హుబ్లీ -ధార్వాడ్ స్మార్ట్‌సిటీ ప్రాజెక్టులో భాగంగా రూ.4.2 కోట్ల వ్యయంతో ఇందిరా గాంధీ గ్లాస్ హౌస్ గార్డెన్లో ఈ చిల్డ్రన్ ట్రైన్‌ను ఏర్పాటు చేశారు. శనివారం ఈ రైలు సేవలు ప్రహ్లాద్ జోషి ప్రారంభించారు. అనంతరం ఆయన కూడా రైలులో ప్రయాణించే సమయంలో పట్టాలు తప్పడం వల్ల ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటన మీద విచారణకు ఆదేశించారు.