రంగంలోకి దిగిన టీపీసీసీ వ్యూహకర్త సునీల్
కొన్ని రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖ (టీపీసీసీ)కి సునీల్ అనే వ్యక్తి వ్యూహకర్తగా నియమితులయ్యారు. శనివారం నాడు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్కం ఠాగూర్ ఆధ్వర్యంలో జరిగిన పార్టీ సీనియర్ నేతల సమావేశానికి హాజరైన సునీల్ బృందం సమావేశంలో ప్రతి నేత లేవనెత్తిన అంశాలను నోట్ చేసుకుంది. ఇక మీదట పార్టీలో జరిగే దాదాపు అన్ని భేటీలకు సునీల్ టీం సభ్యులు హాజరవుతారని కాంగ్రెస్ పార్టీ వర్గాలకు అధిష్టానం సమాచారం ఇచ్చింది. సార్వత్రిక ఎన్నికల కంటే ముందుగానే తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలోనే టీపీసీసీకి వ్యూహాలు రచించేందుకు సునీల్‌ను నియమించినట్లుగా చెబుతుండగా ఆయన బృందం నేరుగా రంగంలోకి దిగడం ఇదే మొదటి సారి అని అంటున్నారు. పీకే శిష్యుడైన ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు(ఎస్కే) ఇటీవలే కాంగ్రెస్ కు వ్యూహకర్తగా జాయిన్ అయ్యారు. ఇప్పుడు పీకే కూడా కాంగ్రెస్ కు పని చేసే అవకాశాలు కనబడుతూ ఉండడం ఆసక్తికరంగా మారింది.