Srilanka Crisis:శ్రీలంక రాజకీయ సంక్షోభం కొలిక్కివచ్చినట్టేనా..ముందున్న అసలు సవాళ్లు ఇవే..!
Srilanka Crisis:శ్రీలంకలో రాజకీయ అనిశ్చితికి తెరపడింది. తాత్కాలిక అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న రణిల్ విక్రమ్ సింఘే కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 44 ఏళ్ల తర్వాత నేరుగా అధ్యక్షుడిగా ఎన్నుకుంది శ్రీలంక పార్లమెంట్. పార్లమెంట్లో 219 మంది సభ్యులు ఉంటే 134 మంది ఆయనకు మద్దతు ఇచ్చారు. దులస్ అలహాప్పెరుమాతో పాటు అనూర కుమార దిశనాయకే పోటీ చేశారు. ఎస్‌జేబీ నాయకుడు సాజిత్ ప్రేమదాస అలహాప్పెరుమాకు మద్దతు ప్రకటించారు. దాంతో మొదట్లో దులస్ వైపే మొగ్గు చూపడంతో ఇద్దరి మధ్య తీవ్ర పోటీ నెలకొంది.గొటబయ రాజపక్సే ప్రాతినిధ్యం వహిస్తున్న ఎస్ఎల్పీపీ ఎంపీలందరూ రణిల్ వైపు మొగ్గు చూపారు. అధ్యక్ష ఎన్నికలకు పోటీ పడిన ఎస్ఎల్పీపీ చీలికవర్గం నేత దుల్లాస్ అలహప్పేరుమాకు 54 ఓట్లు వచ్చాయి. మరో వైపు లంక అధ్యక్ష ఎన్నికలపై ప్రభావం చూపుతున్నట్లు వచ్చిన నివేదికలను భారత్ ఖండించింది. ప్రజాస్వామ్య మార్గాలు మరియు విలువలకు అనుగుణంగా శ్రీలంక ప్రజల ఆకాంక్షల సాకారానికి మద్దతిస్తున్నట్లు భారత్ పునరుద్ఘాటించింది.
అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత రణిల్ విక్రమ్‌సింఘే పార్లమెంట్లో మాట్లాడారు. దేశం తీవ్ర సంక్షోభంలో ఉందన్న ఆయన ఎన్నో సవాళ్లు ఉన్నాయని వెల్లడించారు. 2020 సార్వత్రిక ఎన్నికల్లో రణిల్ విక్రమ్‌సింఘే పార్టీ యూఎస్సీకి ఒక్క సీటు కూడా రాలేదు. అయితే మొత్తం ఓట్ల ఆధారంగా కేటాయించిన సీటుతో పార్లమెంట్‌కు నామినేట్ అయ్యారు. పార్లమెంట్‌కు నామినేట్ అయిన వ్యక్తి దేశ అధ్యక్షుడవ్వడం శ్రీలంకలో తొలిసారి. రణిల్ విక్రమ్ ఆరు పర్యాయాలు ప్రధాన మంత్రిగా పని చేశారు. మరోవైపు కొత్త అధ్యక్షుడి ఎన్నిక పూర్తైనా లంకలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. అధ్యక్ష కార్యాలయం వెలుపల నిరసనకారులు రణిల్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
గొటబయ రాజపక్సే అనుచరుడిగా పేరున్న రణిల్ దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి ఎలా గట్టెక్కిస్తారన్నదే జోరుగా చర్చ సాగుతోంది. నాలుగు నెలలుగా కొలంబో అధ్యక్ష భవనం ముందు ప్రజలు ఆందోళన చేస్తున్నారు. ఆందోళకారులు కోరుకున్నట్లుగా గొటబయ రాజీనామా చేసి దేశం విడిచి పారిపోయారు. దీంతో ప్రజల చేత ఆందోళనను ఎలా విరమింపజేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. శ్రీలంకకు విదేశాల్లో దాదాపు 51 బిలియన్ల డాలర్ల అప్పులున్నాయ్. అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థను ఒప్పించి బెయిల్ ఔట్ ప్యాకేజ్ తీసుకురావడమే రణిల్ ముందున్న ప్రధాన కర్తవ్యం. అయితే ఐఎంఎఫ్ బెయిల్ ఔట్ ప్యాకేజ్‌కు అంత సులువుగా ఒప్పుకునే అవకాశాలు లేవు. దేశంలో అవినీతి పేరుకుపోయింది. రాజపక్సే కుటుంబం దేశాన్ని దోచేసుకుంది. అవినీతి రహితపాలన అందిస్తామని హామీ ఇస్తే ఐఎంఎఫ్ ఆలోచించనుంది.
శ్రీలంకలో పెట్రోల్, డీజిల్ కొరత తీవ్రంగా ఉంది. వాహనదారులకు పెట్రోల్ కోసం అష్టకష్టాలు పడుతున్నారు. ప్రస్తుతం అత్యవసర సర్వీసులకు మాత్రమే పెట్రోల్‌ను సరఫరా చేస్తున్నారు. రెండ్రోజుల క్రితం పెట్రో ధరలను సవరించింది సిలోన్ పెట్రోలియం కార్పొరేషన్. ప్రస్తుతం శ్రీలంకలో లీటర్ పెట్రోలు 450,సూపర్ డీజిల్ 520 రూపాయలుగా ఉంది. ఆటో డీజిల్ లీటర్ పై 20 తగ్గించి ప్రస్తుతం 440 రూపాయలకు విక్రయిస్తోంది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ధరలు పెరిగిపోయాయ్. పెట్రోల్, డీజిల్ ధరల నుంచి ప్రజలకు రణిల్ ఎలా విముక్తి కల్పిస్తారో ధరల కట్టడికి ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.
శ్రీలంకలో ఉత్పత్తయ్యే కెమికల్స్, చిరు ధాన్యాలు, వాహనాలను ఎగుమతులు పెంచితే…ఆదాయం పెరగనుంది. ఎగుమతుల కంటే దిగుమతులకే ఎక్కువ ఖర్చు చేస్తోంది. ఈ రెండింటిని విక్రమసింఘే బ్యాలన్స్ చేయాల్సి ఉంది. పర్యాటక రంగాన్ని కరోనా ఊహించని దెబ్బ కొట్టింది. విదేశాల నుంచి నుంచి పర్యాటకులు సంఖ్య తగ్గిపోయింది. దీంతో దాదాపు 30 లక్షల మందికి ఉపాధి కరువైంది. అంతకుముందు జరిగిన వరుస బాంబు దాడులూ…పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావం చూపాయి. ముఖ్యంగా టూరిజం అభివృద్ధికి చర్యలు తీసుకుంటే…ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షల మంది ఉపాధి దొరకనుంది.