Prannoy Roy: నిఖారైన జర్నలిజానికి కేరాఫ్ అడ్రస్ ప్రణయ్ రాయ్
ఎన్డీటీవీ అనే పేరు వినగానే మనకు మొట్టమొదటిగా గుర్తుకు వచ్చే పేరు ప్రణయ్‌రాయ్. అద్భుతమైన ఇంగ్లిష్ ఉచ్ఛారణతో న్యూస్ అందించే విధానం ప్రణయ్‌రాయ్‌కు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చిపెట్టింది. అటువంటి ప్రణయ్‌రాయ్ ప్రస్తుతం ఎన్డీటీవీకి దూరమయ్యే పరిస్థితులు తలెత్తుతున్నాయి. తాజాగా అదానీ గ్రూప్ ఎన్డీటీవీలోకి ఎంట్రీ ఇవ్వడంతో పరిస్థితులు శరవేగంగా మారుతున్నాయి. ప్రణయ్‌రాయ్ భవితవ్యంపై పలు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అంచెలంచెలుగా ఎదిగిన ప్రణయ్‌రాయ్ ప్రస్తానంలో అనేక మైలురాళ్లులున్నాయి. ఆ ప్రస్తానంపై ఓ లుక్కేద్దాం.
భారతదేశంలో నిఖారైన జర్నలిజానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన వ్యక్తి ప్రణయ్ రాయ్. ఇంగ్లిష్ జర్నలిజం అనగానే మన దేశంలో మొట్టమొదట గుర్తుకు వచ్చే పేరు ప్రణయ్ రాయ్. న్యూస్ ఛానెళ్ల వెల్లువ ప్రారంభం కాకముందు నుంచే ప్రణయ్‌రాయ్ జర్నలిజంలో రాటు దేలారు. దూరదర్శన్ న్యూస్‌కి అనేక కార్యక్రమాలు చేసి అందించేవారు. ఎన్నికల ఫలితాలు వెలువడే సందర్భంగా ప్రణయ్‌రాయ్ చేపట్టిన ఎనాలసిస్ కార్యక్రమం అప్పట్లోనే కోట్లాదిమందిని టీవీలకు అతుక్కుపోయేలా చేసేది. ఎన్నికల ఫలితాల విశ్లేషణ చేసే ఆ ఒక్కరోజుకు ప్రణయ్‌రాయ్ కోటి రూపాయల వరకు ఫీజు వసూలు చేసేవాడంటే ఆయనకు అప్పట్లో అటువంటి డిమాండ్ ఉండేది.
స్వతహాగా చార్టెడ్ అకౌంటెంట్ అయిన ప్రణయ్‌రాయ్ న్యూస్ రంగంలోనే ప్రవేశించి అనేక అద్భుతాలు చేశారు. మెరికల్లాంటి అనేక మందిని ఇంగ్లిష్ జర్నలిజం రంగంలో పాతుకుపోయేలా చేశారు. వారందరికీ ఒక మార్గదర్శిగా నిలిచాడు. ప్రఖ్యాతిగాంచిన అర్నాబ్ గోస్వామి, రాజ్‌దీప్ సర్దేశాయ్ వంటి జర్నలిస్టులు ప్రణయ్‌రాయ్ వద్దే శిష్యరికం చేశారు. తమని తాము మెరుగుపరుచుకున్నారు. భారతదేశంలో ఒపీనియన్ పోల్స్ నిర్వహణ అనేని ప్రణయ్‌రాయ్ ప్రారంభించినదే కావడం విశేషం.
ప్రణయ్‌రాయ్ తండ్రి భారతదేశంలో ఉన్న ఓ బ్రిటీష్ కంపెనీలో ఉన్నత స్థానంలో పనిచేసేవారు. ప్రణయ్ తల్లి ఐర్లాండ్‌కి చెందిన మహిళ. డెహ్రాడూన్‌లోని డూన్ స్కూల్‌లో ప్రణయ్ ప్రాధమిక విద్యాభ్యాసం జరిగింది. లండన్‌లోని క్వీన్ మారీ కాలేజీ నుంచి ఎకనమిక్స్ లో గ్రాడ్యుయేషన్ పూర్తయింది. ఆ తర్వాత ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ నుంచి డాక్టరేట్ కూడా పూర్తయింది.
విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత జర్నలిజం రంగంలో ప్రవేశించిన ప్రణయ్‌రాయ్ దూరదర్శన్, బీబీసీ న్యూస్‌లలో పనిచేశారు. వరల్డ్ దిస్ వీక్, న్యూస్ టు నైట్ అనే కార్యక్రమాలు ప్రణయ్‌రాయ్‌కు మంచి పేరు తెచ్చాయి. ఆ తర్వాత భారత ఆర్ధికశాఖలో సలహాదారుగా కూడా కొంత కాలం పాటు సేవలందించారు. ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ లో అసోసియేట్ ప్రొఫెసర్‌గా సేవలందించారు. ప్రపంచ ప్రఖ్యాత సంస్థ ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్ ఇండియా విభాగానికి కన్సల్టెంట్‌గా కూడా ప్రణయ్‌రాయ్ పనిచేశారు.
1988లో తన భార్య రాధికతో కలిసి న్యూ ఢిల్లీ టెలివిజన్ అనే టెలివిజన్ ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించారు. అక్కడి నుంచి ప్రణయ్‌రాయ్ వెనక్కితిరిగి చూసుకోలేదు. భారత టెలివిజన్ న్యూస్ రంగంలో తిరుగులేని స్థానం సంపాదించుకున్నాడు. ఎందరికో ఆదర్శంగా నిలిచారు. అన్నో అవార్డులను అందుకున్నారు.