మా రోడ్లే కాదు మీ రోడ్లూ బాలేదు!
ఏపీ మీద తెలంగాణ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలను ఖండించిన సజ్జల రామకృష్ణారెడ్డి కేటీఆర్ అయినా ఎవరైనా మాట్లాడే ముందు వాళ్ల రాష్ట్రం గురించి మాట్లాడాలన్నారు. ఆ తర్వాతే ఇతరుల గురించి మాట్లాడాలని, రాష్ట్ర విభజన తర్వాత ఆస్తుల పంపకాలు ఇంకా పూర్తిగా జరగలేదని చెప్పుకొచ్చారు. సుమారు 50- 60 వేల కోట్ల ఆస్తులు విభజన జరగాల్సి ఉందని ఆయన అన్నారు. ఏపీకి కేపిటల్ లేకుండానే విభజన చేశారని, విభజన తర్వాత 5 ఏళ్లపాటు అభివృద్ధి జరగలేదని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ అభివృద్ధి చెందిందని, హైదరాబాద్ లో పీవీ ఎక్స్ ప్రెస్ వే వైఎస్ హయాంలో చేపట్టారని గుర్తు చేశారు. రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందో వాళ్లకూ మనకూ అందరికీ తెలుసని, అధిక వర్షాల వల్లే రాష్ట్రంలో రోడ్లు దెబ్బతిన్నాయని చెప్పుకొచ్చారు. కేటీఆర్ వ్యాఖ్యలను రాజకీయం చేయదలచు కోలేదని అంటూనే తెలంగాణ లోనూ రోడ్లు బాగాలేవని, మొన్నటి వరకు తెలంగాణ లోనూ విద్యుత్ కోతలున్నాయని చెప్పుకొచ్చారు. ఇక రాష్ట్ర ప్రజలకు అన్ని విషయాలు తెలుసన్న ఆయన సీఎం జగన్ పాలనలో తన మార్కును చూపిస్తున్నారని అన్నారు. ఇక దిశ చట్టం తెచ్చిన స్పూర్తితో యువతిని చంపిన నిందితుడికి ఉరిశిక్ష పడిందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. దిశ చట్టంపై చేస్తున్నవన్నీ రాజకీయ విమర్శలేనన్న ఆయన దిశ చట్టం పై విమర్శలు చేస్తున్న వారికి తీర్పు చెంపపెట్టు లాంటిదన్నారు.