ప్రాణాల మీదకు తెచ్చిన ప్రీ వెడ్డింగ్ షూట్
ఒకప్పుడు పెళ్ళిళ్ళు రోజుల తరబడి జరిగేవి అని చెప్పుకుంటూ ఉంటారు. ఇప్పుడు అలా రోజుల తరబడి పెళ్ళిళ్ళు జరగకపోయినా తమ పెళ్ళిళ్ళని వందేళ్ల పాటు గుర్తుంచుకునేలా చేసుకుంటున్నారు నేటి యువత. అందులో భాగంగానే ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ షూట్ లాంటివి ఎక్కువగా చేసుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో మన తెలుగు రాష్ట్రాల్లో వధూవరులు ప్రీ వెడ్డింగ్ షూటింగ్ చేసుకోవాలని ముచ్చట పడుతున్నారు. అయితే ప్రీ వెడ్డింగ్ షూటింగ్ కారణంగా ఒక జంట ప్రాణాలమీదికి వచ్చింది. తాజాగా ప్రీ వెడ్డింగ్ షూటింగ్ కారణంగా ఒళ్ళు గగుర్పొడిచే సంఘటన రంగారెడ్డి జిల్లా కోహెడలో జరిగింది. ప్రీ వెడ్డింగ్ షూట్ చేస్తున్న సమయంలో తేనెటీగలు దాడి చేయడంతో వధువు, వరుడు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వీరిద్దరిని ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఎల్లుండి పెళ్లి చేసుకుని ఆనందంగా ఉండాల్సిన వాళ్ళు ప్రీ వెడ్డింగ్ షూటింగ్ కారణంగా ప్రాణాలమీదికి తెచ్చుకోవడంతో ఇరు కుటుంబాల సభ్యులు ఆందోళన చెందుతున్నారు.