సీఐపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ బూతు పురాణం
టీఆర్ఎస్ 21వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లో ఆ పార్టీ భారీ ఎత్తున ప్లీనరీని నిర్వహిస్తున్న వేళ…ఆ పార్టీకి చెందిన కీలక నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డికి చెందిన ఓ ఆడియో క్లిప్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది. ఫోన్‌లోనే తాండూరు సీఐ రాజేందర్ రెడ్డిపై బూతు పురాణం అందుకున్న మహేందర్ రెడ్డి…సీఐవి అయినా కూడా నీ తాట తీస్తా బిడ్డా అంటూ బెదిరింపులకు దిగిన వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల తాండూరులోని ఓ ఆలయంలో జరిగిన కార్యక్రమంలో మహేందర్ రెడ్డితో పాటు స్థానిక ఎమ్మెల్యే, టీఆర్ఎస్ నేత రోహిత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తనకంటే కూడా రోహిత్ రెడ్డికి అధిక ప్రాధాన్యం దక్కినట్టుగా అనుమానించిన మహేందర్ రెడ్డి…దానికి కారణం తాండూరు టౌన్ సీఐగా ఉన్న రాజేందర్ రెడ్డేనని భావించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో నేరుగా రాజేందర్ రెడ్డికే ఫోన్ చేసిన మహేందర్ రెడ్ది ఆయనపై బూతులు లంఘించుకున్నారు. మంచిగా మాట్లాడాలంటూ సీఐ ఎంతగా వేడుకున్నా కూడా వినని మహేందర్ రెడ్డి పోలీసు అధికారిపై విరుచుకుపడ్డారు. ఈ ఆడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.