జగన్ తో మేకపాటి భేటీ.. అధికారిక ప్రకటన వెలువడే అవకాశం?
ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీగా ఉన్న ఆత్మకూరు నియోజకవర్గం ఉప ఎన్నికల పై కసరత్తు మొదలుపెట్టారు వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ మేరకు ఆయన గురువారం మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. దివంగత మంత్రి గౌతమ్ రెడ్డి మరణంతో ఖాళీ అయిన ఆత్మకూరు నియోజకవర్గంలో ఉప ఎన్నికపై వీరిద్దరి మధ్య చర్చ జరిగింది. ఇక ఎన్నికల బరిలో పార్టీ అభ్యర్థిగా గౌతమ్ రెడ్డి సోదరుడు విక్రమ్ రెడ్డి పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సీటును గౌతమ్ రెడ్డి భార్యకు కాకుండా ఆయన సోదరుడికి అవకాశం ఇద్దామని మేకపాటి కుటుంబసభ్యులు ఇటీవలే నిర్ణయించి సీఎం జగన్‌కు వివరించినట్టు చెబుతున్నారు. ఇక ఈ క్రమంలోనే ఆత్మకూరు ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థిగా విక్రమ్ రెడ్డి పేరును ఖరారు చేయించే దిశగా మేకపాటి రాజమోహన్‌రెడ్డి కీలక చర్చలు జరపనున్నారని అంటున్నారు. విక్రమ్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసే ముందు కుటుంబ సభ్యులు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలతో పలు దఫాలుగా సంప్రదింపులు జరిపారు. అనంతరం ఈ విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆత్మకూరు నుంచి వైసీపీ తరఫున మేకపాటి విక్రమ్ రెడ్డి పేరు దాదాపు ఖరారైనట్టు అంతా భావిస్తున్నారు. ఈరోజు భేటీ అనంతరం దీని మీద అధికారిక ప్రకటన వెలువడే అవకాశం కనిపిస్తోంది.