కలెక్టర్ అనుకుని రెండు లక్షల 40 వేలు సమర్పయామి
కర్రపుల్ల, అగ్గిపుల్ల, సబ్బు బిళ్ళ కాదేదీ కవితకు అనర్హం అని ఒక మహా కవి అన్న విధంగా డబ్బులు కొట్టేయడానికి ఏ దారి వదలడం లేదు కేటుగాళ్లు. తాజాగా ఒక కలెక్టర్ పేరు మీద నకిలీ వాట్సాప్ ఖాతా సృష్టించి ఆ ఖాతా ద్వారా రెండు లక్షల 40 వేల రూపాయలను తన బ్యాంకు ఖాతాలోకి బదిలీ చేయించుకున్నాడు. కలెక్టర్ డబ్బులు అడిగి తీసుకోవడం ఏమిటి అని అనుమాన పడిన బాధితుడు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఇదంతా సైబర్ నేరగాళ్ల వ్యవహారం అని తేలింది. అసలు వివరాల్లోకి వెళితే తెలంగాణలోని నారాయణపేట కలెక్టర్ హరిచందన పేరుతో ఆమె ఫోటో తో సైబర్ నేరగాడు మీ వాట్సాప్ ఖాతా సృష్టించాడు. అంతేకాక ఈ వాట్సాప్ ఖాతా నుంచి జిల్లాలో పలువురు అధికారులకు, ప్రముఖులకు తాను ఒక సమావేశంలో ఉన్నానని ఒక వస్తువు అర్జెంట్గా కొనుగోలు చేసేందుకు డబ్బు కావాలి అంటూ మెసేజ్ చేశాడు. ఈ మెసేజ్ చూసిన జిల్లా కేంద్రానికి చెందిన ఒక వ్యక్తి మూడు విడతలుగా రెండు లక్షల 40 వేల రూపాయలు సైబర్ నేరగాడు సూచించిన ఖాతాకు బదిలీ చేశారు. కలెక్టర్ ఇలా డబ్బులు అడగడం ఏమిటి అని అనుమానం వచ్చి ఆరాతీయగా ఇది నకిలీ ఖాతా అని తేలింది. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు రంగంలోకి దిగారు. డబ్బు కాజేసిన వ్యక్తి జార్ఖండ్కు చెందిన వ్యక్తి అని గుర్తించారు. ప్రస్తుతం ఈ అంశం మీద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.