పాతబస్తీలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
పాతబస్తీ పరిధిలో పలు అభివృద్ధి పనులను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. మీర్ ఆలం చెరువు వద్ద మూజికల్ ఫౌంటైన్ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్ 480 ఎమ్మెల్డీల ఎస్టీపీలకు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆ తరువాత ఆయన మాట్లాడుతూ మతము పేరుతో రాజకీయాలు చేసే విధ్వంసకర శక్తులను ఒక కంట కనిపెడుతూ ఉండాలన్నారు. మత విద్వేషాలను రెచ్చగొట్టే వారిని ఉక్కుపాదంతో అణిచివేస్తూ ముందుకు పోతున్నామని అన్నారు. హైదరాబాద్ లో నీటి సమస్య లేదు…కరెంటు సమస్య లేదు, హైదరాబాద్ వారసత్వ సంపదను కాపాడుకుంటూ నగర అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. హైదరాబాద్ లో నోటరీ ప్రాపర్టీ విషయంలో ప్రభుత్వం తొందరగా నిర్ణయం తీసుకుంటుందని హామీ ఇస్తున్నానని అన్నారు. బహుదర్ పురాకు జామా ఉస్మానియా వ్యవస్థాపకుడి పేరు పెడతామన్న ఆయన పాతబస్తీలో రెండు మూడు నెలలో డబుల్ బెడ్ రూమ్ ల నిర్మాణం పూర్తి చేసి అప్పగిస్తామని అన్నారు. టిఆర్ఎస్ సర్కార్ వచ్చిన తర్వాత మొజంజాహి మార్కెట్ ను అద్భుతముగా తీర్చిదిద్దామని, సర్ధార్ మహల్ ను 30 కోట్లతో పునరుద్ధరణ చేకుంటున్నామని అన్నారు. బహదూర్ పురా ఫ్లై ఓవర్ 109 కోట్లతో నిర్మాణం చేసి… ప్రారంభించామని అన్నారు. ఇక విధ్వంసకర శక్తులు, మతం పేరిట …కులం పేరిట రాజకీయాలు చేసే చిల్లర మల్లర వ్యక్తులను ఒక కంట కనిపెట్టాల్సిన బాధ్యత అందరి మీద ఉందని ఆయన అన్నారు. కేసీఆర్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత మతం పేరు మీద ఎవరైనా చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తే వాళ్ళను ఉక్కుపాదంతో అణిచివేస్తూ ముందుకు పోతున్నామని, కులాలు మతాల మధ్య చిచ్చు పెట్టి…ఆ చిచ్చులో చలి మంటలు కాపుకునే ప్రయత్నం మేము చేయలేదు, చేయబోమని అన్నారు. నేను హైదరాబాద్ లో చదువుకునేటప్పుడు ఏదో ఒక పంచాయితీ వల్ల కర్ఫ్యూ ఉండేది…కానీ ఇప్పుడు ఆ బాధ లేదని అన్నారు.