Karnataka MLA: కట్టుతప్పి ప్రిన్సి పల్ ని కొట్టిన కర్ణాటక ఎమ్మెల్యే
Karnataka MLA manhandled principal: ఎమ్మెల్యే అంటే ఎలా ఉండాలి?. నలుగురూ చూసి నేర్చుకునేట్లు ఉండాలి. ప్రజాప్రతినిధి కాబట్టి ప్రజలకు ఆదర్శంగా నిలవాలి. అధికారం ఉంది కదా అని ఆగ్రహాన్ని అదుపులో పెట్టుకోకపోతే కట్టుతప్పుతాడు. ఇదిగో ఇలా ఓ కర్ణాటక ఎమ్మెల్యే మాదిరిగా విమర్శలపాలవుతాడు. ఆ రాష్ట్రంలోని మాంద్య నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న జనతాదళ్ (సెక్యులర్) పార్టీ శాసన సభ్యుడు ఎం.శ్రీనివాస్ ఒక కాలేజీ ప్రిన్సిపల్ పై చెయ్యి చేసుకున్నాడు.
నల్వాడి కృష్ణరాజా వడియార్ ఐటీఐ కాలేజీలో ఈ ఘటన సోమవారం చోటుచేసుకుంది. కంప్యూటర్ ల్యాబ్ నిర్మాణ పనులను పరిశీలించటానికి వచ్చిన ఆయన దానికి సంబంధించి ప్రిన్సిపల్ నాగానంద్ ని కొన్ని ప్రశ్నలు అడిగారు. వాటికి ఆయన సరిగా సమాధానం చెప్పలేకపోయేసరికి శాసన సభ్యుడికి కోపం నషాళానికి ఎక్కింది. దీంతో అందరి ముందే ప్రిన్సిపల్ పై పలుమార్లు చెయ్యి చేసుకున్నాడు. ఆ సమయంలో మాంద్య అసిస్టెంట్ కమిషనర్ ఐశ్వర్యతోపాటు ఇతర ప్రజాప్రతినిధులు, ప్రభుత్వాధికారులు అక్కడే ఉన్నారు.
కాలేజీ ప్రిన్సిపల్ అనే ఒక గౌరవప్రదమైన పోస్టులో ఉన్న వ్యక్తి పట్ల కనీస మర్యాద కూడా పాటించకుండా ఇలా కొట్టడాన్ని ప్రజలు తీవ్రంగా తప్పుపడుతున్నారు. చట్టాలు చేయాల్సిన వ్యక్తులే ఆ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవటం సమంజసం కాదని మండిపడుతున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో శరవేంగా షేర్ అవుతోంది. కాగా ఈ ఘటన గురించి పైఅధికారులకు తెలిపామని మాంద్య జిల్లా ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రెసిడెంట్ శంభుగౌడ పేర్కొన్నారు.