Palki Sharma: జర్నలిజంలో పల్కీ శర్మ రూటే వేరు
How the Indian Journalist Palki Sharma became Popular
భారతదేశంలో న్యూస్ ఛానెళ్ల రాకతో జర్నలిజానికి క్రేజ్ పెరిగింది. అనేక మంది టీవీ జర్నలిజం ద్వారా వెలుగులోకి వచ్చారు. తన కంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. వారిలో పల్కీ శర్మ కూడా ఒకరు. వియోన్ టీవీలో వచ్చే గ్రావిటీస్ అనే ప్రత్యేక కార్యక్రమం ద్వారా ఆమె మరింత పాపులర్ అయ్యారు. కోట్లాది మంది వీక్షకులను కట్టిపడేశారు.
20 సంవత్సరాల పాటు యాంకర్‌గా వివిధ న్యూస్ ఛానెళ్లలో పనిచేసిన పల్కీ శర్మ కొద్ది కాలం క్రితం రూటు మార్చారు. గ్రావిటీ షో అనే ప్రోగ్రామ్ ద్వారా అనేక సంక్లిష్ట విషయాలను సామాన్యులకు సైతం అర్ధమయ్యేలా వివరించడం మొదలు పెట్టారు. ఆ కార్యక్రమానికి రోజు రోజుకు ఆదరణ పెరుగుతూ వచ్చింది. సూపర్ హిట్ ప్రోగ్రామ్‌గా మన్ననలు అందుకుంది.
పల్కీ శర్మ కెరీర్ మొదట్లో రిపోర్టర్‌గా, యాంకర్‌గా అనేక కార్యక్రమాలు చేశారు. ఓ ఛానెల్‌లో ఆమె చేసిన బ్రేక్ ఫాస్ట్ షో దేశ వ్యాప్తంగా మంచి పాపులారిటీ సాధించింది. 2014లో రాత్రి 9 గంటలకు ప్రసారం అయ్యే డిబేట్ కార్యక్రమాలు చేశారు. ఆ సమయంలో ఆమెకు తీవ్ర అసంతృప్తి కలిగి ఆ కార్యక్రమానికి గుడ్ బై చెప్పారు. అటువంటి కార్యక్రమాలు ఇక నుంచి చేయకూడదని నిర్ణయించుకున్నారు. ఆ సమయంలో కొంత గ్యాప్ తీసుకున్నారు. క్రియేటివ్‌గా ఆలోచించడం మొదలు పెట్టారు. 2016లో ప్రారంభమైన ఎస్సెల్ గ్రూప్‌కి చెందిన వియాన్ న్యూస్ టీవీలో చేరారు.
ఇంగ్లిష్ న్యూస్ ఛానెల్ అయిన వియోన్ టీవీలో ప్రయోగాలు చేసేందుకు పల్కీ శర్మకు అవకాశం దొరికింది. అక్కడి నుంచి పల్కీ శర్మ తిరిగి వెనక్కి చూసుకోలేదు. గ్రావిటీ షో ద్వారా ఆమె కోట్లాది మందికి చేరువయ్యారు. న్యూస్ ఛానెళ్లలో డిబేట్ల రూపంలో జరిగే కొట్లాటలతో విసిగెత్తిపోయిన ప్రేక్షకులు గ్రావిటీ షో కు బాగా కనెక్ట్ అయ్యారు. అత్యంత సరళమైన ఇంగ్లిష్ భాషను ఉపయోగిస్తూ, భారతీయులకు ఈజీగా అర్ధమయ్యే రీతిలో ఉచ్ఛారణ (Pronunciation) చేస్తూ మంచి ఆదరణ పొందారు.
ANI న్యూస్ ఛానెల్‌కి చెందిన స్మితా ప్రకాశ్ చేసిన ఇంట్వర్యూలో పల్కి శర్మ తన కెరీర్‌కి చెందిన అనేక విషయాలను వెల్లడించారు. మహిళా జర్నలిస్టుగా తన కెరీర్‌లో ఎదురైన అనేక సవాళ్లను ఎలా ఎదుర్కొన్నారనే విషయాన్ని కూడా ఆమె వివరించారు.
వియోన్ న్యూస్‌కి రాజీనామా
తనకు అత్యంత పాపులారిటీ తెచ్చిపెట్టిన వియోన్ న్యూస్ ఛానెల్‌కు పల్కీ శర్మ ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో గుడ్‌బై చెప్పారు. టీవీ 18లో మేనేజింగ్ ఎడిటర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఈ క్రమంలో ఆమె కోర్టు కేసును ఎదుర్కొన్నారు. ఎస్సెల్ గ్రూప్ అధినేతలైన జీ గ్రూప్ సంస్థ (ZMCL) పల్కీ శర్మకు వ్యతిరేకంగా ఢిల్లీ హైకోర్టులో కేసు నమోదు చేసింది. టీవీ 18లో కొనసాగకుండా ఆమెను నిలువరించాలని కోరుతూ జీ గ్రూప్ హైకోర్టును ఆశ్రయించింది.
తమ సంస్థకు కాంపిటేటర్లుగా ఉన్న సంస్థకు పల్కీ శర్మ అనేక కీలక రహస్యాలు చేరేవేసే అవకాశముందని జీ సంస్థ కోర్టుకు తెలిపింది. తమ సంస్థను వీడే ముందు సరైన విధానం అనుసరించలేదని ఫిర్యాదు చేసింది. సకాలంలో నోటీసు ఇవ్వలేదని జీ సంస్థ కోర్టుకు వివరించింది. పూర్వా పరాలను పరిశీలించిన కోర్టు పల్కీ శర్మకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. జీ సంస్థ చేసిన ఫిర్యాదుల్లో బలం లేదని తేల్చింది. పల్కీ శర్మ తనకు నచ్చిన సంస్థలో చేరే స్వేచ్ఛను కలిగి ఉందని తేల్చింది.