Maharastra Political Crisis:పెత్తనమంతా సీఎం, ఆయన కుమారుడిదేనా..?
మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం ముదురుతోంది. శివసేన, కాంగ్రెస్, ఎన్‌సీపీల కూటమి మహా వికాస్ అఘాడీ సర్కారు చిక్కుల్లో పడింది. శివసేనకు చెందిన సీనియర్ నేత, మంత్రి ఏక్‌నాథ్ షిండే సొంత పార్టీ ఎమ్మెల్యేలు 22 మందితో అజ్ఞాతంలోకి వెళ్లారు. దివంగత బాల్ ఠాక్రేకు అత్యంత విధేయుడైన ఏక్‌నాథ్ షిండే మహా వికాస్ అఘాడీ సర్కార్ పనితీరుపై తీవ్ర అసంతృప్తితో ఉండటమే ప్రస్తుత సంక్షోభానికి కారణంగా తెలుస్తోంది. ఠాణేలో శివసేన ముఖ్య నేత అయిన ఏక్‌నాథ్ షిండే.. ఈ ప్రాంతంలో పార్టీ బలోపేతంలో కీలక పాత్ర పోషించారు. అయితే గత కొంతకాలంగా షిండే.. సంకీర్ణ ప్రభుత్వం తీరుతో అసంతృప్తిగా ఉన్నారు. సీఎం ఉద్ధవ్ థాక్రేతో కూడా షిండేతో పాటు పలువురు ఎమ్మెల్యేల విభేదాలు తీవ్రమైనట్లు తెలుస్తుంది.
కాంగ్రెస్, ఎన్సీపీలతో శివసేన కలవటం ఆయనకు మొదటి నుంచీ ఇష్టం లేదు. దీనికి తోడు ఇటు పార్టీలో, అటు ప్రభుత్వంలో తనకు ఏమాత్రం స్వేచ్ఛ లేదని భావిస్తున్నారు షిండే. తన మంత్రిత్వ శాఖలపై కూడా పెత్తనమంతా సీఎం, ఆయన కుమారునిదేనని షిండే తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కేవలం షిండే, ఆయన అనుచరులే కాదు పార్టీ ఎమ్మెల్యేలంతా ఇదే భావనలో ఉన్నట్టు సమాచారం. ఎమ్మెల్యేల నిధుల కేటాయించటంలో ఎన్సీపీ నేత, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సవతి తల్లిలా వ్యవహరిస్తున్నాడని ఆరోపణలు ఉన్నాయి. ఈ పరిణామాలతో అఘాడీ సర్కారు ఇప్పుడు తీవ్ర సంక్షోభంలో పడిపోయింది.
మహా వికాస్ అఘాడీ సర్కారు సంక్షోభంతో రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. అవకాశం కోసం ఎదురు చూస్తున్న బీజేపీ ఇప్పుడు ఎమ్మెల్యేను ఆకర్షించే పనిలో పడింది. ఇప్పటికే సూరత్ హోటల్‌లో ఉన్న రెబల్ ఎమ్మెల్యేలతో గుజరాత్ బీజేపీ అధ్యక్షుల భేటీ అయ్యారు. ఇదే సమయంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో అమిత్‌షా సమావేశం కావడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 స్థానాలు ఉన్నాయి. శివసేనకు 64 మంది ఎమ్మెల్యేలు ఉండగా, ఎన్సీపీ 57,కాంగ్రెస్‌కు 44ఇతరులు పది మంది ఉన్నారు. బీజేపీకి 113 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. శివసేన పార్టీలో తిరుగుబాటుకు ముందు… శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కూటమి బలం మొత్తం 153గా ఉంది. అయితే తిరుగుబాటు తర్వాత ఇప్పుడు శివసేన పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య బాగా తగ్గింది. శివసేనకు చెందిన 22 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడం, వీరికి స్వతంత్రులు మద్దతివ్వడంతో మెజార్టీకి నలుగురు తగ్గే అవకాశం ఉంది. రెబల్ ఎమ్మెల్యేలు బీజేపీ వైపు చేరితే సంకీర్ణ సర్కార్ కూలిపోయే అవకాశం ఉంది.