Telangana Early Elections: తెలంగాణలో మొదలైన ముందస్తు ఎన్నికల హీట్..!
Telangana Early Elections Tention:తెలంగాణలో ముందస్తు ఎన్నికల హడావిడి మొదలైంది.సీఎం కేసీఆర్ డేట్ చెప్పాలంటూ ప్రతిపక్ష పార్టీలకు సవాల్ విసరడం, దమ్ముంటే అసెంబ్లీ రద్దు చేయాలని విపక్షాలు ప్రతిసవాళ్లు విసరడంతో తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా పొలిటికల్ టెన్షన్ పెరిగింది.ఈ ఏడాది చివర్లో గుజరాత్ అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. అలాగే 2023 మార్చిలో కర్ణాటక శాసన సభకు ఎలక్షన్స్ జరుగుతాయి. రెండూ బీజేపీ పాలిత రాష్ట్రాలే. ఈ రెండు రాష్ట్రాల్లో ఏదో ఒక దానితో పాటు ఎన్నికలకు వెళ్లాలన్నది కేసీఆర్ ఆలోచనగా ఇప్పటికే ప్రచారం జరుగుతుండగా నాయకుల సవాళ్లు,ప్రతి సవాళ్లతో తెలంగాణలో ముందస్తు ఎన్నికల హీట్ మొదలైంది.
ఇప్పటికే ఓ విడత ముందస్తుకు వెళ్లిన అనుభవం సీఎం కేసీఆర్ కు ఉంది. దీంతో మరోసారి ముందస్తుకు సిద్ధం డేట్ చెప్పాలంటూ విపక్షాలకు సవాల్ విసురుతున్నారు. అటు ప్రతిపక్షాలు కూడా దీటుగా స్పందించి వెంటనే అసెంబ్లీ రద్దు చేయాలని అధికారపార్టీకి గట్టి సమాధానమే ఇచ్చాయి. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మూడు పార్టీలూ ఇప్పటికే ఎన్నికలకు సిద్దమయ్యాయి. ఎవరికి వారు నియోజకవర్గాల వారీగా బలాబలాల సమీక్షలు పూర్తిచేసుకుని అభ్యర్థుల ఎంపిక కసరత్తు కూడా చేసుకుంటున్నాయి. ఈ ఏడాది చివర్లో గజరాత్ కు జరగబోయే అసెంబ్లీ ఎన్నికలతో పాటు, తెలంగాణకు ఎలక్షన్స్ జరగాలంటే, ఆగస్టులోనే అసెంబ్లీని రద్దు చెయ్యాల్సి వుంటుంది. మార్చిలో కర్నాటకతో పోరుకు సిద్దం కావాలంటే, ఈ సంవత్సరం ఆఖరులో శాసనసభను రద్దు చెయ్యాల్సి ఉంటుందన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతుంది.
గుజరాత్ తో పాటు ఎన్నికలంటే చాలా తక్కువ సమయం ఉండే అవకాశం ఉంది. డిసెంబర్ లో ఎన్నికలు జరగాలంటే, ఆగస్టులోనే అసెంబ్లీ రద్దు చెయ్యాలి. కానీ ఆ పరిస్థితి కనిపించడం లేదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కర్ణాటకతో పాటు ఎన్నికలకు వెళ్లడానికి కేసీఆర్ ఆలోచిస్తున్నారంటూ ఇంకో చర్చ జరుగుతోంది. దక్షిణ భారతంలో బీజేపీ బలంగా వున్న రాష్ట్రం కర్ణాటక, ఎంతోకొంత బలంగా వున్న మరో రాష్ట్రం తెలంగాణ. ఈ రెండు రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు జరిగితే, రెండింటిపైనా దృష్టిపెట్టడం బీజేపీకి అంత సులభం కాదు. కర్ణాటకలో అధికారం నిలుపుకోవడం బీజేపీకి అత్యంత ముఖ్యం. దీంతో రెండు రాష్ట్రాలపైన బీజేపీ దృష్టిసారించడం కష్టమని కేసీఆర్ లెక్కలేస్తున్నారు,
ఇప్పటికే రెండు పర్యాయాలు అధికారంలో ఉన్నారు కాబట్టి, ఏదో ఒకస్థాయిలో ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుందని, అది పెరగకముందే జాగ్రత్త పడాలని పీకే టీం, టీఆర్ఎస్ అధినేతకు నివేదిక ఇచ్చిందన్న చర్చ అంతర్గతంగా నడుస్తుంది. వలసలు పెరగకముందే, విపక్షాలు బలం పుంజుకోకముందే, ఎన్నికలకు వెళ్లాలని ఆయన ఆలోచిస్తున్నారంటూ రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతుంది.అయితే, సీఎం కేసీఆర్ కు ముందస్తు ఎన్నికలపై పెద్దగా ఆసక్తిలేదని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. కేవలం విపక్షాలను డిఫెన్స్ లో పడేసేందుకే ఇలా వ్యూహాత్మకంగా మైండ్ గేమ్ మొదలెట్టారని భావించేవారూ ఉన్నారు.