Coding Contest: ప్రపంచ పోటీలో విజేతగా మన దేశ విద్యార్థి
world’s largest coding contest: ప్రపంచంలోనే అతిపెద్ద కంప్యూటర్ ప్రోగ్రామింగ్ పోటీలో మన దేశ విద్యార్థి విజేతగా నిలిచాడు. ఐఐటీ ఢిల్లీ స్టూడెంట్ కలాష్ గుప్తా ఈ ఘనత సాధించాడు. తద్వారా దాదాపు 8 లక్షల రూపాయల నగదు బహుమతిని సొంతం చేసుకున్నాడు. అంతేకాదు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) కంపెనీలోని రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ ఆర్గనైజేషన్ లో ఇంటర్న్ షిప్ చేసే అవకాశాన్ని కూడా పొందాడు.
ఈ కాంపిటీషన్ లో 87 దేశాలకు చెందిన లక్ష మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు. ‘టీసీఎస్ కోడ్ విటా’గా పేర్కొనే ఈ పరీక్షని గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సంస్థ సైతం గుర్తించింది. ఈ ఏడాది కోడ్ విటా పదో సీజన్ నిర్వహించారు. ఈసారి నెలకొన్నంత పోటీ గతంలో ఎప్పుడూ లేదని నిర్వాహకులు పేర్కొన్నారు. విజేత కలాష్ గుప్తాను ఐఐటీ ఢిల్లీ డైరెక్టర్ రంగన్ బెనర్జీ సత్కరించారు.
కలాష్ గుప్తా 2018లో జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్(జేఈఈ)లో మూడో ర్యాంక్ సాధించి ఢిల్లీ ఐఐటీలోని కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ బ్రాంచ్ లో చేరాడు. టీసీఎస్ కోడ్ విటాలో విజేతగా నిలవటం పట్ల కలాష్ గుప్తా ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. టాప్-3లో ఉంటానేమోనని ఆశించినట్లు తెలిపాడు. పోటీ ప్రారంభంలో తనకు పెద్దగా నమ్మకం ఏర్పడలేదని, ఒక్కో దశ దాటుకుంటూ వెళుతుంటే ఆత్మవిశ్వాసం పెరిగిందని వివరించాడు.