CM Jagan On Capital : విశాఖ ఏపీ రాజధాని..అక్కడి నుంచే పాలన..సీఎం జగన్
CM Jagan Crucial Announcement on Administration From Vizag: ముఖ్యమంత్రి జగన్ విశాఖ కు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేసారు. విశాఖ ఏపీ రాజధానిగా పేర్కొన్నారు. ఢిల్లీలో ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సన్నాహక సదస్సు లో పెట్టుబడి దారులను ఉద్దేశించి ప్రసంగించిన సీఎం విశాఖ ఏపీ రాజధానిగా వెల్లడించారు. త్వరలోనూ తాను విశాఖకు షిప్ట్ అవుతున్నట్లు ప్రకటించారు. అక్కడ నుంచే పాలనా వ్యవహారాలు కొనసాగుతాయని స్పష్టం చేసారు. కొద్ది రోజులుగా వచ్చే ఉగాది నుంచి విశాఖ కేంద్రంగా సీఎం పరిపాలన ప్రారంభించేందుకు సిద్దమవుతున్నారని ప్రచారం సాగుతోంది. ఇప్పుడు ముఖ్యమంత్రి స్వయంగా తాను విశాఖకు షిఫ్ట్ అవుతున్నానని ప్రకటించటం ద్వారా ఇప్పుడు ఇది అమలు దిశగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది.
మూడు రాజధానుల వివాదం పై సుప్రీంకోర్టులో ప్రస్తుతం కేసు పెండింగ్ లో ఉంది. ఈ రోజు సుప్రీంలో ఈ కేసు విచారణలో ఉంది. గతంలో హైకోర్టు అమరావతి రాజధానిగా కొనసాగించాలని తీర్పు ఇవ్వగా ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇదే సమయంలో ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఏ ప్రాంతంలో అయినా ఉంటూ పాలన చేయవచ్చనే అంశాన్ని వైసీపీ ప్రభుత్వం తెర మీదు తీసుకొచ్చింది. అదే అభిప్రాయంతో జగన్ ఉగాది నుంచి విశాఖ కేంద్రంగా పాలన ప్రారంభించేందుకు సిద్దం అవుతున్నారు. విశాఖలో రుషికొండ వద్ద క్యాంపు కార్యాలయం నుంచి సీఎం పాలన ప్రారంభించే అవకాశం ఉంది. విశాఖలో మార్చ 3,4 తేదీల్లో జరిగే గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్ కు సంబంధించి వివిధ దేశాల దౌత్యవేత్తలు, ఫిక్కీ, సీఐఐ ప్రతినిధుల సమావేశంలో జగన్ ఈ వ్యాఖ్యలు చేసారు.
ఏపీ ప్రభుత్వం ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ ప్రభుత్వంగా చెప్పారు. రాష్ట్రంలో 21 రోజులకే పరిశ్రమలకు సింగిల్ విండో విధానం ద్వారా అనుమతులు ఇస్తున్నామని వివరించారు. రాష్ట్రంలో ఉన్న సుదీర్ఘ సముద్ర తీర ప్రాంతం వలన ప్రయోజనాలను వివరించారు. ఏపీ పెట్టుబడులకు అనువైన రాష్ట్రంగా పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆరు పోర్టులు అందుబాటులోకి వస్తున్నాయని వివరించారు. మూడేళ్లుగా ఏపీ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో తొలి స్థానంలో ఉందని చెప్పారు. డబుల్ డిజిట్ గ్రోత్ రేటుతో ఏపీ ముందుకెళ్తోందని చెప్పుకొచ్చారు. కేంద్రం సహకారంతో విశాఖ కేంద్రంగా నిర్వహిస్తున్న గ్లోబల్ సమిట్ కు రావాలంటూ పారిశ్రామిక వేత్తలను సీఎం జగన్ ఆహ్వానించారు. పలువురు పారిశ్రామిక వేత్తలతో సీఎం వరుస సమావేశాలు నిర్వహించనున్నారు.
ఏపీకి కాబోయే రాజధాని విశాఖలో జరిగే గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కు మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను- పారిశ్రామిక వేత్తలతో ముఖ్యమంత్రి వైయస్ జగన్ #APGIS2023 #InvestInAP pic.twitter.com/nClNQOuhbn
— YSR Congress Party (@YSRCParty) January 31, 2023