ఈ వేస్ట్ తో భవనాలు.. ఐరాస ఫిదా!
ఇప్పుడు నిర్మాణ రంగం ఊపందుకుంటోంది. అయితే నిర్మాణం అభివృద్ధికి సంకేతం కావొచ్చు కానీ.. పర్యావరణానికి కాదు, అందుకే తృప్తి దోషి అనే యువతి పర్యావరణాన్ని కాపాడాలని కొన్ని భవనాలు వినూత్న రీతిలో నిర్మిస్తున్నారు. పోటీలు పడి నిర్మిస్తున్న భవంతుల నిర్మాణాల్లో వాడే పదార్థాలు పర్యావరణానికి ఎంత హాని చేస్తున్నాయి అనే విషయం తెలుసుకున్న తృప్తి వెర్నాక్యులర్ ఆర్కిటెక్చర్‌పై దృష్టి పెట్టింది. కాంక్రీట్, సిమెంట్ లేనప్పుడు మన పూర్వీకులు సున్నం, మట్టి, కలప, బండలు, రాళ్లు వంటి వాటితో నిర్మించేవారు. ‘తమిళనాడులో 82 ఏళ్ల ఒక పెద్దాయనకి చెట్టినాడు నిర్మాణశైలి గురించి తెలుసు అని విని వెళ్లి, ఆ కిటుకులు తెలుసుకుని ఈ రకమైన నిర్మాణం మొదలు పెట్టింది. తమిళనాడులోని ఆరోవిల్లే స్వచ్ఛంద సంస్థకి శరణం రూరల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ని నిర్మించాల్సి రావడంతో స్టీల్, సిమెంట్, ఇటుకల వాడకాన్ని బాగా తగ్గించి మట్టితో ఈ నిర్మాణాన్ని పూర్తి చేసిందట తృప్తి. 4,500 చదరపు అడుగుల స్లాబ్ వేయడానికి కేవలం 33 సిమెంట్ బస్తాలని మాత్రమే వాడారట. ఇక స్లాబ్‌లు, గోడల నిర్మాణం కోసం తృప్తి ఈ- వేస్ట్ ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ- వేస్ట్ అంటే పనికిరాని కీబోర్డులు, మౌస్‌లతో పాటు కొబ్బరిచిప్పలు, పాత సీడీలు, గాజు సీసాలు, ఖాళీ టెట్రాప్యాక్‌లని ఉపయోగిస్తారట. పరిశ్రమల నుంచి వెలువడే బూడిదతో ఇటుకలు చేసి, నిర్మాణాల్లో ఉపయోగిస్తున్నారని తృప్తి తెలిపింది. యునైటెడ్ నేషన్స్ ఎన్విరాల్‌మెంటల్ ప్రోగ్రామ్ సంస్థ ఈ నిర్మాణాన్ని గుర్తించి భావితరాల నిర్మాణాలకు స్ఫూర్తిగా చూపించింది.