IAS శ్రీలక్ష్మికి షాకిచ్చిన హైకోర్టు
సీనియర్ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి ఏపీ హైకోర్టు షాకిచ్చింది. ఆమె వేసిన రివ్యూ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు కొట్టేసింది. అసలు విషయానికి వస్తే న్యాయస్థానం ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేశారని శ్రీలక్ష్మితో సహా ఎనిమిది మందికి రెండు వారాల సాధారణ జైలు శిక్ష, ₹1000 జరిమానా విధిస్తూ కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఈ క్రమంలో క్షమాపణలు చెప్పడంతో ఏడాదిపాటు నెలకోసారి ఏదో ఒక ఆదివారం సాంఘిక సంక్షేమ, ఎస్టీ, బీసీ సంక్షేమ వసతి గృహాలను సందర్శించి అక్కడి విద్యార్థులతో కొంత సమయం గడపాలని ఆదేశించింది. ఈ విషయమై తనకు విధించిన శిక్షను పున:పరిశీలించాలని కోరుతూ శ్రీలక్ష్మి తాజాగా పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ఆమె పిటిషన్‌ను కొట్టివేసింది. అంతేకాదు అమరావతిలో ప్రభుత్వం నుంచి ప్లాట్లు కొనుక్కున్నారు కాబట్టి అమరావతి కేసులో న్యాయమూర్తులు జస్టిస్ ఎమ్ సత్యనారాయణ మూర్తి, జస్టిస్ డివివి సోమయాజులు తప్పుకోవాలని ప్రభుత్వం తరఫున శ్రీలక్ష్మి పిటీషన్ వేయగా దాని మీద కూడా స్పందించిన తీరు ఆసక్తిగా మారింది. ఆ పిటీషన్ తోసి పుచ్చుతూ, శ్రీలక్ష్మి పైన హైకోర్టు చేసిన వ్యంగ్య వ్యాఖ్యానం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.