Gujarat Elections: గుజరాత్ ఎన్నికల్లో వింత దృశ్యాలు…
Gujarat Elections: గుజరాత్ రాష్ట్రానికి మొదటిదశ ఎన్నికలు నేడు జరిగాయి. దక్షిణ గుజరాత్, కచ్-సౌరాష్ట్ర ప్రాంతంలోని 19 జిల్లాల్లో 89 నియోజక వర్గాలకు ఎన్నికలు జరిగాయి. ఈ 89 నియోజక వర్గాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రశాంతంగా ముగిశాయి. 799 మంది ఈ ఎన్నికల్లో పోటీ చేశారు. ఇక ఇదిలా ఉంటే, తొలి విడత ఎన్నికల్లో అనేక వింతలు చోటు చేసుకున్నాయి. నవ వధూవరులు ఎన్నికల్లో ఓటు వేసేందుకు పెళ్లిదుస్తుల్లోనే వచ్చి ఓటుహక్కును వినియోగించుకున్నారు. నవ వధూవరులు పెళ్లైన వెంటనే ఆ దుస్తుల్లోనే వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవడంపై ఎన్నికల అధికారులు హర్షం వ్యక్తం చేశారు.
అధికారులు, భద్రతా సిబ్బంది నవ వధూవరులతో ఫొటోలు దిగారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోను సోషల్ మీడియాలో పోస్టైన వెంటనే 2017లో ఓ యువతి ఇదేవిధంగా వధువు దుస్తుల్లో ఫంక్షన్ హాల్ నుంచి వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్న ఫొటోను షేర్ చేశారు. ఇక పోతే, కాంగ్రెస్ నేత పరేష్ దవానీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు సైకిల్‌పై గ్యాస్ సిలీండర్ ను పెట్టుకొని పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత పెట్రోల్, గ్యాస్ ధరలు అమాంతం కొండెక్కాయని, తాము అధికారంలోకి వస్తే గ్యాస్ , పెట్రోల్ ధరలు సగానికి తగ్గిస్తామని అన్నారు. పరేష్ దవానీ గ్యాస్ సిలీండర్ సైకిల్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.