పెరుగుతున్న భక్తుల రద్దీ.
వేసవి సైతం లెక్క చేయని శ్రీవారి భక్తులు
ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల( Tirumala)లో మండే ఎండలను సైతం లెక్క చేయకుండా వెంకన్న దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. . వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ( Vaikuntam Queue Complex) లన్నీ భక్తులతో నిండిపోగా.. ఉచిత దర్శనానికి ఈ రోజు 24 గంటల సమయం పడుతోంది. స్పెషల్ ఎంట్రీ ( రూ. 300) దర్శనానికి 6 గంటల సమయం .. కాలి నడకన వచ్చిన భక్తులకు 8 నుంచి 10 గంటల సమయం పడుతోంది.
మొన్న 77,436 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా.. బుధవారం 79,207 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వారిలో 41,427 మంది తలనీలాలను సమర్పించుకున్నారు. అయితే మంగళవారం 3.77 కోట్ల రూపాయల హుండీ ఆదాయం రాగా… బుధవారం 3.19 కోట్ల రూపాయల హుండీ ఆదాయం వచ్చినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెప్పారు. అలాగే ఈరోజు కూడా నిన్నటిలాగే సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోందని తెలిపారు.
తిరుమల వెంకన్న భక్తులకు టీటీడీ శుభవార్త వినిపించింది. జూన్, జూలై, ఆగస్ట్ నెలకు సంబంధించిన ఆర్జిత సేవలు, దర్శన టికెట్లను ఆన్ లైన్లలో బుక్ చేసుకునే భక్తులకు.. సౌకర్యవంతంగా ఉండేలా తిరుమల తిరుపతి దేవస్థానం షెడ్యూల్ విడుదల చేసింది. సాధారణంగా సేవా టికెట్లు లేదా దర్శన టికెట్ల విడుదల చేసే తేదీ కనుక ఆదివారం వస్తే.. వాటిని మరుసటి రోజు విడుదల చేస్తారు. ఆ షెడ్యూల్లో.. ప్రతినెలా 18 నుంచి 20వ తేదీ వరకు సుప్రభాతం, అర్చన, తోమాల, అష్టదళపాదపద్మారాధన వంటి ఆర్జిత సేవల లక్కీ డిప్ కోసం నమోదు చేసుకోవచ్చు. అలాగే 20 నుంచి 22 వరకు డిప్ లో టిక్కెట్లు పొందిన వాళ్లు.. డబ్బులు చెల్లించి టిక్కెట్లను కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఇక కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ ఊంజల్ సేవలతోపాటు వర్చువల్ సేవా టిక్కెట్లను 21 న విడుదల చేస్తారు. శ్రీవాణి, ఆంగ ప్రదక్షిణం, వృద్ధులు, దివ్యాంగుల కోసం జూన్, జూలై, ఆగస్ట్ నెలల కోసం ఉచిత ప్రత్యేక దర్శన టికెట్లు 23 మధ్యాహ్నం 3 గంటలకు ఆన్ లైన్లో విడుదలవుతాయి. అదే విధంగా రూ.300/- దర్శన టికెట్ల కోటాను 24 వ తేదీన, తిరుపతిలో గదుల కోటాను 25 తేదీన, తిరుమలలో గదుల కోటాను 26న విడుదల చేస్తుంది టీటీడీ. భక్తులు ఈ విషయాలను గమనించి సేవా టికెట్లు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ కోరింది.
మరోవైపు మే 31 నుంచి జూన్ 8 వరకు.. అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్నట్లు టీటీడీ తెలిపింది. దీనికోసం మే 23 మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, మే 30 సాయంత్రం అంకురార్పణ నిర్వహిస్తారు. మే 31న ధ్వజారోహణం -పెద్దశేష వాహనం, జూన్ 1 న చిన్నశేష వాహనం హంస వాహనం, జూన్ 2న సింహ వాహనం ముత్యపుపందిరి వాహనం. జూన్ 3న కల్పవృక్ష వాహనం కల్యాణోత్సవం, సర్వభూపాల వాహనం..జూన్ 4న మోహినీ అవతారం గరుడ వాహనం, జూన్ 5న హనుమంత వాహనం గజ వాహనం.. జూన్ 6 వ తేదీన సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం..జూన్ 7న రథోత్సవం అశ్వవాహనం..అలాగే జూన్ 8 వ తేదీన చక్రస్నానం ధ్వజావరోహణ సేవ జరుగుతాయి.
బ్రహ్మోత్సవాల్లో ఉదయం 8 గంటల నుండి 9 గంటల వరకు అలాగే రాత్రి 7 గంటల నుండి 8 గంటల వరకు ఈ వాహనసేవలు జరుగనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. జూన్ 3 సాయంత్రం 4.30 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు స్వామివారి కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహిస్తారు . దంపతులు రూ.500/- చెల్లించి ఈ కళ్యాణోత్సవంలో పాల్గొనే అవకాశాన్ని టీటీడీ కల్పిస్తోంది. కళ్యాణోత్సవంలో పాల్గొనే గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డు, ఒక అప్పం అందజేస్తారు. ఈ సందర్భంగా ప్రతిరోజు ఆధ్యాత్మిక, భక్తి సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు, కోలాటాలు నిర్వహించనున్నారు. టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, దాససాహిత్య ప్రాజెక్టు, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ఇవి జరగనున్నాయి.