తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. శుక్ర, శని, ఆదివారాల్లో సిఫార్సు లేఖలపై సుప్రభాత సేవ కేటాయింపును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలియజేశారు.
Tirumala Tirupati Devasthanam: తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. శుక్ర, శని, ఆదివారాల్లో సిఫార్సు లేఖలపై సుప్రభాత సేవ కేటాయింపును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలియజేశారు. గురువారం రోజున తిరుప్పావడ సేవను ఏకాంతంగా నిర్వహిస్తామని తెలియజేశారు. అదేవిధంగా సిఫార్సు లేఖలతో వీఐపీ బ్రేక్ దర్శనాలను కూడా రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. సాధారణంగా వేసవి ప్రారంభం నుంచి రుతుపవనాలు ఆరంభం అయ్యే వరకు తిరుమల భక్తులతో కిటకిటలాడుతుంది. ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటారు. తిరుమలలో సౌకర్యాలు అందుబాటులో లేకున్నా భక్తులు కొండకు తరలి వస్తారు. కోనేటిరాయుడిని దర్శనం చేసుకుంటారు. కొండరాయుడికి మొక్కులు చెల్లించుకొని కోరికలు నెరవేర్చమని అడుగుతారు.
వేసవి కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. సర్వదర్శనం టోకెన్లు లేకున్నా నేరుగా క్యూలైన్ల ద్వారా స్వామివారిని దర్శనం చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. స్వామివారి దర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతున్నది. పిల్లలు వృద్ధులు క్యూలైన్లో నిలబడలేక ఇబ్బందులు పడుతున్నారు. అయినప్పటికీ స్వామి వారిని ఒక్కక్షణం చూసినా చాలు అనుకుంటూ దర్శనాలు చేసుకుంటున్నారు. పెద్ద సంఖ్యలో తిరుమలేశుడిని దర్శించుకునేందుకు వస్తుండటంతో వీఐపీ బ్రేక్ దర్శనాలను నిలిపివేసి, సామాన్యులకు అవకాశం కల్పిస్తున్నారు. సామాన్యులు వేగంగా దర్శనాలు చేసుకునే విధంగా టీటీడీ సౌకర్యాలను ఏర్పాటు చేసింది. నిత్యం 60 నుంచి 70 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. అంతేకాదు, ప్రతిరోజూ రూ. 4 కోట్ల వరకు హుండీ ఆదాయం వస్తున్నట్టు అధికారులు పేర్కొన్నారు.