కలియుగ వైకుంఠమైన తిరుమలలో మళ్లీ పెరిగిన రద్దీ
తిరుమల సమాచారం..
నిన్న శనివారం కావడంతో తిరుమల( Tirumala)లో భక్తుల రద్దీ బాగా పెరిగింది. ఇక శ్రీవారి హుండీ ఆదాయం కూడా నిన్నటి కంటే ఎక్కువగా వచ్చిందని అధికారులు చెప్పారు. ఇక ఈరోజు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ( Vaikuntam Queue Complex) లన్నీ భక్తులతో నిండిపోగా.. ఉచిత దర్శనానికి 10 నుంచి 12 గంటల సమయం పడుతోంది. స్పెషల్ ఎంట్రీ ( రూ. 300) దర్శనానికి 6 గంటల సమయం .. కాలి నడకన వచ్చిన భక్తులకు 6 నుంచి 8 గంటల సమయం పడుతోంది.
శనివారం 85,297 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వారిలో 37,392 మంది తలనీలాలను సమర్పించుకున్నారు. మొన్న రూ.331 కోట్ల ఆదాయం రాగా.. నిన్న 3.71 కోట్ల రూపాయల హుండీ ఆదాయం వచ్చినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెప్పారు.అలాగే ఈ రోజు సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోందని తెలిపారు.
తిరుమలలో భక్తులు తెలుసుకోవాల్సిన వివరాలు
శ్రీవారి జనరల్ సేవ వారం రోజులు ఉంటుంది. దీని కోసం 18 ఏళ్లు నిండిన వారి నుంచి అరవై ఏళ్ల వయసు వారు అర్హులు. అలాగే పరకమని సేవ కోసం 18 నుంచి 65 ఏళ్ల వయసున్న ఉద్యోగులు లేదా 3 నుంచి 4 రోజుల సేవ చేసే భక్తులు అర్హులు. కాలి నడకన శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు శ్రీవారి మెట్టు నుంచి ప్రతి రోజు ఉదయం 6 గంటలకు అనుమతిస్తారు. రోజుకు 5వేల మందికి మాత్రమే టోకెన్లు ఇస్తారు. అయితే శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులు ఆధార్ కార్డు తీసుకుని వెళ్లడం మరచిపోకూడదు.
ఇక తిరుమల శ్రీ ఏడుకొండలవాడి ప్రత్యేక దర్శనవేళలు ఒక్కోరోజు ఒక్కోవిధంగా ఉంటాయి. స్వామివారికి జరిగే నిత్య, వారపు సేవలను బట్టి ఆయా సమయాలను టీటీడీ నిర్దేశిస్తుంది. కాబట్టి తిరుమల వెళ్లే భక్తులు ముందుగానే దీనిపై ఎంక్వైరీ చేసి వెళ్లడం మంచిది. టిక్కెట్లను ముందస్తుగా ఆన్ లైన్ , ఈ-దర్శన్, తపాలా శాఖ ద్వారా విక్రయిస్తోంది. ఉదయం నుంచి సాయంత్రంలోపు ఒక సమయాన్ని ఎంచుకుని శ్రీవారిని దర్శనం చేసుకోవచ్చు.
అలిపిరి నుంచి వెళ్లే భక్తులకు అలిపిరి ఏపీఎస్ ఆర్టీసీ బస్టాండ్ వెనుక భూదేవి కాంప్లెక్స్ లో ఉదయం 4 గంటల నుంచి 10,000 పదివేల మందికి.. టోకెన్లు ఉన్నంత వరకు ఉచితముగానే ఇస్తారు. అలా తీసుకున్నవాళ్లు గాలి గోపురం వద్ద 2,053 వ మెట్టు వద్ద టోకెన్లను తప్పనిసరిగా ఆధార్ కార్డు చూపించి స్కాన్ చేయించుకోవాలి. ఆ దివ్య దర్శనం టోకెన్లు తీసుకొని సప్తగిరి కాంప్లెక్స్ ఎదురుగా తిరుమలలో రిపోర్టు చేసి తర్వాత దర్శనానికి వెళ్లాలి.
ఆన్లైన్ సేవా బుకింగ్ ప్రతి నెలా 20 తేదీ నుంచి 28 తేదీ వరకు రిలీజ్ చేస్తారు. శ్రీవాణి సేవా టిక్కట్లు, వీఐపీ దర్శనం టిక్కెట్లు , రూములు సీఆర్ఓ (CRO) ఆఫీస్ లో రిపోర్టు చేసి దర్శనానికి వెళ్లాలి. రూ. 300 టిక్కెట్లను రూములతో సహా బుక్ చేసుకుని వెళ్లాలి. వాళ్లు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1 ద్వారా వెళ్లాలి.