Sharmila: అన్న బాటలోనే షర్మిల.. భలే ప్లానింగ్ బాసూ!
Sharmila to Follow Jagan Strategy: తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ స్థాపించి వైయస్సార్ తెలంగాణ పార్టీగా తెలంగాణలో పాగా వేసేందుకు షర్మిల ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పాదయాత్ర పేరుతో తెలంగాణలో చాలావరకు ప్రాంతాలను చుట్టేసిన ఆమె ఈ మధ్యనే పాలేరు వెళ్లి అక్కడి నుంచే తను అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు. ఇప్పటికే పాలేరు నుంచి గెలిచేందుకు ఆమె అనేక ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకుంటున్నారు. తండ్రి వైఎస్ఆర్ ని గుర్తు చేస్తూ సొంత నిధులతో ఆమె పాలేరులో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. విద్య వైద్యం రంగాలనే ప్రధానాస్త్రాలుగా మార్చుకుంటున్న ఆమె సొంత నిధులతో నియోజకవర్గ వ్యాప్తంగా అవసరం ఉన్నవారికి అండగా నిలవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. పేదలు మరణిస్తే వారి కుటుంబాలకు ఆర్థిక సాయం అందించేందుకు షర్మిల ఒక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారని ఒక రకంగా ఆమె తండ్రి, అన్నబాటలలోనే పయనించేందుకు సిద్ధమవుతున్నారని అంటున్నారు.
అంటే జగన్ అభివృద్ధి అనే విషయం మీద పెద్దగా ఫోకస్ చేయకుండా కేవలం సంక్షేమం అనే విషయం మీదనే ఫోకస్ చేసి ముందుకు వెళుతున్నారు. అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని నడిపిస్తున్నారని ఎందరు అంటున్నా పేదలకు అవన్నీ అనవసరం వాళ్లకు ఆర్థిక సాయం అందిందా లేదా అనేదే వాళ్ళు చూసుకుంటున్నారు, కాబట్టి సంక్షేమానికి పెద్దపీట వేయడానికి జగన్ కూడా వెనుకాడడం లేదు. ఇప్పుడు ఇదే ప్రయత్నాలను పాలేరులో షర్మిల కూడా చేయబోతున్నారని అంటున్నారు. ఆరోగ్యశ్రీ కార్డు తరహాలో పేదలకు వైద్యం పొందేందుకు వీలుగా షర్మిల సొంత గుర్తింపు కార్డులను అందించేందుకు కూడా ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాక సొంత నిధులతో నియోజకవర్గంలోని ప్రతి మండలంలోనూ అంబులెన్స్ లను సిద్ధం చేయించారని టాక్ వినిపిస్తుంది. అదే విధంగా విద్యార్థులకు ఉన్నత చదువులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తన తండ్రి వైఎస్సార్ బాటలో నడిచి వాళ్లకు మంచి విద్య అందేలా చేస్తానని షర్మిల చెబుతున్నట్లుగా తెలుస్తోంది.
అంతేకాక ఒక రకంగా పేదలకు ఉచిత వైద్యం అనే కాన్సెప్ట్ ప్రారంభించాలని దాదాపు నిర్ణయం తీసుకున్నారని ఈ నేపథ్యంలోనే ఖమ్మంలోని కొన్ని ప్రైవేటు ఆసుపత్రులతో కూడా షర్మిల సంప్రదింపులు జరుపుతున్నారని తెలుస్తోంది. అయితే కేవలం ఖమ్మం వరకే పరిమితం కాకుండా హైదరాబాదులో ఉన్నత స్థాయి వైద్యానికి అయ్యే ఖర్చును కూడా పార్టీ భరించేలా ప్లాన్ చేస్తున్నారు. అంతేకాక పేద విద్యార్థులకు ప్రైవేట్ స్కూళ్లలో ఉచిత చదువు అందించేందుకు కూడా కొన్ని ఎంపిక చేసిన పాఠశాలలో షర్మిల చర్చలు జరుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతానికి పాలేరు నియోజకవర్గంలో పేదలు ఎవరైనా మరణిస్తే వారి కుటుంబ సభ్యులకు ప్రస్తుత కందాల ఉపేందర్ రెడ్డి 10000 చొప్పున సాయం అందిస్తున్నారు. దీనిని ఏకంగా పాతిక వేలకు పెంచేసి నేను మీ దాన్ని ఇక మీతోనే నా ప్రయాణం అంటూ షర్మిల వారి దగ్గరకు వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు. ఇక ఇప్పటికే కొనుగోలు చేసిన స్థలంలో ఆమె ఆఫీస్ తో పాటు ఇల్లు కూడా కట్టించుకోబోతున్నారని పూర్తి స్థాయిలో ఆమె పాలేరు మీదే ఫోకస్ చేయబోతున్నారని తెలుస్తోంది.