YS Sharmila : తెలంగాణలో ఆసక్తికర రాజకీయం… సీనియర్ నేత ఇంటికి షర్మిల
YS Sharmila meets DS : వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సిగ్గు లేకుండా స్త్రీపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు అంటూ అధికార పార్టీ నేతలపై మండిపడింది. మునుగోడులో ఎందుకు ఉప ఎన్నికలు ? వాళ్ల స్వార్థం కోసమేనని, వీళ్లకు కోట్లలో ఫైన్ వేయాలని, ఇష్టం వచ్చినట్లు రాజీనామా చేయడం వల్ల, నచ్చిన పార్టీలోకి రావడం వల్లనే ఎన్నికలు వస్తున్నాయని అన్నారు. ఇక వైఎస్ షర్మిల వరదల గురించి మాట్లాడుతూ పక్క రాష్ట్ర పోలవరం కారణమన్నారు. మరి ఇది ముందు కనిపించలేదా? దీని గురించి ముందు ఎందుకు మాట్లాడలేదు? ఆ ముఖ్యమంత్రిని ఇంటికి పిలిపించుకొని స్వీట్లు తినిపించుకున్నప్పుడు ఎందుకు ఇవన్నీ మాట్లాడుకోలేదు? అని సూటిగా ప్రశ్నించారు. ఇప్పుడు ముంపు వచ్చాక ఆ పరిస్థితి నుంచి తప్పించుకోవడానికి ఈ సాకులన్నీ చెబుతున్నారని విమర్శించారు.
ఇక మాజీ పిసిసి చీఫ్, మాజీ రాజ్యసభ ఎంపీ డి. శ్రీనివాస్ ను పరామర్శించిన వైఎస్ షర్మిల డిఎస్ ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య ఆసక్తి కరమైన చర్చ నడిచింది. వైఎస్సార్ తో ఉన్న పాత అనుభవాలను గుర్తు చేసిన డిఎస్ తెలంగాణ ప్రజల్లో వైఎస్సార్ పై అభిమానం చెక్కు చెదరకుండా ఉందని గుర్తు చేశారు. సరైన టైంలో ప్రజల స్పందన బ్రహ్మాండంగా ఉండబోతుందని, షర్మిల ఒక ఐరన్ లేడీ అని ఆమెపై ప్రశంసల వర్షం కురిపించారు. నా రాజకీయ అనుభవంతో చెప్తున్నాను షర్మిల ముఖ్యమంత్రి అవుతుంది అంటూ డిఎస్ అభిప్రాయం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ ముఖ్యమంత్రి అవుతారు అని 2003 లోనే నేను చెప్పానని గుర్తు చేసిన డిఎస్ భవిష్యత్ లో వైఎస్సార్ బిడ్డ తప్పక ముఖ్యమంత్రి అవుతుందని డిఎస్ నమ్మకం వ్యక్తం చేశారు.
ఓటీటీలో సినిమాల కోసం సలహా అడిగితే తాము వెటకారంగా ట్వీట్ చేశామని, దానికి చిన్న దొర గారికి కోపం వచ్చిందని, అందుకే తమపై వ్యక్తిగతంగా విరుచుకుపడ్డారని వైఎస్ షర్మిల అన్నారు. దమ్ముంటే సబ్జెక్టు మాట్లాడండి. అధికారం చేతుల్లో ఉంది, పాలన చేతుల్లో ఉంది, ఇంట్లో కూర్చుని షోలు, సినిమాలు చూస్తారా? ఇంట్లో నుంచి రిమోట్గా పని చేయలేరా? కరోనా సమయంలో మనమందరం పని చేయలేదా? అంటూ షర్మిల ఫైర్ అయ్యారు. వరదలొచ్చి ఒక పక్క రైతులు నష్టపోయారు, ఇండ్లు కోల్పోయారని, వాళ్లకు ఒక్క రూపాయి సాయం చేయలేదని, ఓటీటీ సినిమాలు చూస్తారట అంటూ ఎద్దేవా చేశారు. ప్రజలకు ఏం హామీలిచ్చి అధికారంలోకి వచ్చారని, ఏ హామీలు నెరవేర్చకుండా సిగ్గు లేకుండా ఒక స్త్రీపై పై వ్యక్తిగతం విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.