Ys Sharmila: రేపు ఢిల్లీలో షర్మిల దీక్ష!
Ys Sharmila: తెలంగాణ రాజకీయాలు ఢిల్లీలో ధర్నాల వరకూ వెళ్తున్న అంశాలు హాట్ టాపిక్ అవుతున్నాయి. మహిళా రిజర్వేషన్ల కోసమంటూ ఎమ్మెల్సీ కవిత జంతర్ మంతర్‌లో ధర్నా చేయగా ఇప్పుడు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల చేయబోతున్నారు. కాళేశ్వరంలో అవినీతిపై విచారణకు డిమాండ్ చేస్తూ ఆమె ఢిల్లీ నడిబొడ్డున ధర్నా చేయబోతున్నారు. కాళేశ్వరంలో రూ. 70 వేల కోట్ల అవినీతి జరిగిందని ఈ విషయం మీద ఫిర్యాదు చేసినా విచారణ చేపట్టడం లేదని ఆరోపిస్తూ రేపు 14న ఢిల్లీలో జంతర్ మంతర్ లో ధర్నా చేసి అక్కడి నుంచి పార్లమెంట్ వరకు మార్చ్ చేసుకుంటూ వెళ్లాలని షర్మిల నిర్ణయించుకున్నారు. 2జీ, కోల్ కుంభకోణాలకు ఏమాత్రం తీసిపోని విధంగా కాళేశ్వరం ప్రాజెక్టులో కుంభకోణం జరిగింది అని ఆమె ఆరోపించారు. ఈ మేరకు ప్రాజెక్టులో జరిగిన అవినీతి గురించి దేశం మొత్తం తెలిసేలా జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ భవనం వరకు నడుచుకుంటూ శాంతియుతంగా ధర్నా చేయనున్నట్లు ఆమె ప్రకటించారు. లోటస్ పాండ్లో మాట్లాడిన ఆమె కాళేశ్వరం ప్రాజెక్టులో ఇంత అవినీతి జరిగినా విచారణ ఎందుకు చేపట్టడంలేదని ప్రశ్నించారు. తాను చేస్తున్న ధర్నాకు రాష్ట్రంలోని అన్ని పార్టీల ఎంపీలు మద్దతు ఇవ్వాలని షర్మిల విజ్ఞప్తి చేశారు.