Yadadri: జగన్మోహిని అలంకారంలో యాదగిరి నరసింహ స్వామి
Yadadri: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు కన్నులపండగగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రోజుకో అవతారంలో యాదగిరి నరసింహ స్వామి భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్నాడు. సోమవారం శ్రీ స్వామివారు జగన్మోహిని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మార్చి 3వ తేదీన బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. యాదాద్రీశుడిని చూసిన భక్తులు భక్తితన్మయంతో ఉప్పొంగిపోతున్నారు. జగన్మోహిని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన యాదాద్రి నరసింహుడు అశ్వవాహన సేవలో ఊరేగారు.
ఉదయం శ్రీ స్వామివారి ఆలయంలో నిత్యారాధనల అనంతరం జగన్మోహినిగా అలంకరించి ప్రధాన అర్చకులు అత్యంత వైభవంగా ఆలయ మాడవీధులలో స్వామి వారిని ఊరేగించారు. అంతకుముందు సాంస్కృతిక కార్యక్రమాలు ధార్మిక సాహిత్య సంగీత కార్యక్రమాలు జరిగాయి. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఉద్ఘాతన అనంతరం ప్రధానాలయంలో మొదటిసారిగా బ్రహ్మోత్సవాల సందర్భంగా కళ్యాణోత్సవం నిర్వహించేందుకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మరోవైపు విద్యుత్ కాంతుల్లో యాదాద్రి ఆలయం దగదగ మెరిసిపోతుంది. ఆలయ పరిసరాలన్నీ కూడా విద్యుత్ కాంతులతో దర్శనమిస్తున్నాయి.ఇక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రేపు దివ్య విమాన రథోత్సవం, గరుడ వాహనసేవ జరుగనుందని ఆలయ అధికారులు తెలిపారు. 3వ తేదీ ఉదయం 10 గంటలకు శ్రీస్వామి వారికి అష్టోత్తర శతఘటాభిషేకం, రాత్రి 9గంటలకు శ్రీస్వామి వారి శృంగార డోలోత్సవంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.