Bandi Sanjay: బండి సంజయ్ కు మహిళా కమిషన్ నోటీసులు!
Bandi Sanjay: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈడీ నోటీసుల అంశంలో తప్పు చేసిన వారికీ నోటీసులు ఇవ్వకపోతే ముద్దు పెట్టుకుంటారా? అని బండి సంజయ్ ప్రశ్నించడం హాట్ టాపిక్ అయింది. ఇక బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ సోమవారం నాడు అంటే ఈరోజు కొద్దిసేపటి క్రితం నోటీసులు జారీ చేసింది. మార్చి 15వ ఉదయం 11.00 గంటలకు కమిషన్ ఎదుట హాజరు కావాలని బండి సంజయ్ కు సూచించింది. బీఅర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను సుమోటోగా మహిళా కమిషన్ తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఈరోజు నోటీసులు జారీ చేసింది. ఎమ్మెల్సీ కవిత పై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాలని జారీ చేసిన నోటీసుల్లో పేర్కొంది. మార్చి 15వ తేదీన రాష్ట్ర మహిళా కమిషన్ కార్యాలయంలో వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో ఆదేశించింది. మహిళా కమిషన్ ముందు హాజరు కాకపోతే తదుపరి చర్యలు తీసుకుంటామని మహిళా కమిషన్ హెచ్చరించింది. అయితే మహిళా కమిషన్ ఎదుట బండి సంజయ్ హాజరు అవుతారా? లేదా అనేది చూడాల్సి ఉంది.