Azharuddin: కామారెడ్డి నుంచి పోటీ చేస్తా..అజహరుద్దీన్
Azharuddin: హెచ్ సీఏ అధ్యక్షుడు,టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అజహరుద్దీన్ సంచలన ప్రకటన చేశారు. అధిష్టానం అవకాశమిస్తే వచ్చే ఎన్నికల్లో కామారెడ్డి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తానంటూ అజారుద్దీన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన కామారెడ్డి పర్యటించారు. లింగంపేటలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో అజహరుద్దీన్ సమక్షంలో పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేసారు.
కామారెడ్డి నియోజకవర్గం కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీది. 2004లో ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచిన షబ్బీర్ అలీ.. వైఎస్ కేబినెట్‌లో మంత్రిగా పని చేశారు. అయితే 2009, 2014, 2018 వరుస ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. ఇప్పుడు ఆ స్థానం నుండి పోటీచేయాలని అజహరుద్దీన్ భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లోనూ ఇక్కడి నుంచే బరిలోకి దిగాలని షబ్బీర్ అలీ భావిస్తున్నారు. ఈ క్రమంలో అజహరుద్దీన్ వ్యాఖ్యలపై అందరు ఇప్పుడు చర్చించుకుంటున్నారు. అజహరుద్దీన్ గతంలో కాంగ్రెస్ తరపున యూపీలోని మొరాదాబాద్ నుంచి ఎంపీగా గెలిచారు. ఆ తరువాత ఆయన తెలంగాణ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. కానీ ఇక్కడ ఆయన కాంగ్రెస్ పార్టీలో పెద్దగా రాణించలేకపోతున్నారు. మరి అజహరుద్దీన్ కోరికను టీ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎలాస్పందిస్తాడో చూడాలి.