New TRS: తెలంగాణ కొత్త TRS వెనక ఉన్నది ఎవరు?
New TRS: ఈ ఏడాది చివర్లో తెలంగాణలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది రాజకీయ వాతావరణం వేడెక్కుతూ కనిపిస్తుంది. ఇప్పటికే భారత రాష్ట్ర సమితి భారతీయ జనతా పార్టీ మధ్య వాడి వేడిగా పరిస్థితులు ఉన్నాయి. కాంగ్రెస్ కూడా తానున్నానని చెబుతుంటే నేను సైతం అంటూ షర్మిల కూడా పోటీలో దిగుతోంది. ఇప్పటికే ఇన్ని పార్టీలు రంగంలోకి దిగాయి అనుకుంటే ఇప్పుడు తెలంగాణలో మరో పార్టీ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి అంటూ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే టిఆర్ఎస్ బిఆర్ఎస్ గా మారడంతో ఇప్పుడు పాత టిఆర్ఎస్ పేరు వాడుకోవాలని కొందరు రాజకీయ నేతలు ప్రయత్నిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.
టిఆర్ఎస్ పేరు వచ్చేలా రాష్ట్ర ఎన్నికల కమిషన్ తో పాటు కేంద్ర ఎన్నికల కమిషన్ కి కూడా దరఖాస్తులు వెళుతున్నాయని తెలుస్తోంది. ముఖ్యంగా తెలంగాణ రైతు సమాఖ్య, తెలంగాణ రక్షణ సమితి, తెలంగాణ రైతు సమితి, తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం సమితి ఇలా టీఆర్ఎస్ పేరు వచ్చేలా పార్టీ రిజిస్ట్రేషన్ కోసం అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయని అంటున్నారు. వాస్తవానికి తెలంగాణ ప్రజల సెంటిమెంట్ టిఆర్ఎస్ విషయంలో బాగా వర్కౌట్ అయింది. ఆ పేరు క్యాష్ చేసుకునేందుకు ఇప్పుడు అనేక రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒకవేళ ఈ పేరుతో నిజంగా ఎవరైనా పార్టీ ఏర్పాటు చేస్తే భారత రాష్ట్ర సమితికి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయని కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే ప్రజల్లో ఇప్పటికీ టీఆర్ఎస్ అనే పదమే బాగా వాడుకలో ఉందని బిఆర్ఎస్ కి ఇప్పుడు వచ్చే ఓట్లు కూడా ఆ పార్టీకి వెళ్లే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారడంతో పాటు రిజిస్ట్రేషన్ కూడా పూర్తి అవడంతో అధికారులు కొత్తగా టిఆర్ఎస్ పార్టీ పేరును ఏ రాజకీయ పార్టీకి అయినా కేటాయించే అవకాశం ఉంది. అయితే ఇలా ప్రయత్నాలు చేయించడం వెనక ఎవరున్నారనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే బీజేపీ తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో పాగా వేయడానికి అనేక దారులను వెతుక్కుంటుంది. ఎలా చేసైనా ఏం చేసైనా తెలంగాణలో అధికారంలోకి రావాలని బిజెపి సిద్ధంగా ఉంది. తెలంగాణ కంటే ముందే కర్ణాటక ఎన్నికలు జరగబోతున్నాయి, ఈ రెండు రాష్ట్రాల్లో కనుక బీజేపీ పాగా వేయగలిగితే దక్షిణాది రాష్ట్రాల్లో పట్టు దొరికినట్లేనని బిజెపి పెద్దలు భావిస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణ ఇచ్చిన తరువాత మూడోసారి ఎన్నికలకు వెళ్లబోతోంది. కచ్చితంగా ఈసారి గెలుపు తనదే అని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇప్పటికే రెండుసార్లు కేసీఆర్ మాయమాటలు నమ్మి తెలంగాణ ప్రజలు మోసపోయారు, కాబట్టి ఈసారి మమ్మల్ని గెలిపిస్తే అసలైన తెలంగాణ అభివృద్ధి ఏమిటో చూపిస్తామని కాంగ్రెస్ చెబుతోంది. మరి తెలంగాణ ప్రజలు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? ఎలాంటి నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్ళబోతున్నారు అని ఆసక్తికరంగా మారింది/ మరి టిఆర్ఎస్ పార్టీ పేరు ఎవరికి కలిసి రాబోతోంది ఎవరికి ఇబ్బందికరంగా మారబోతోంది అనేది కూడా చూడాల్సి ఉంది.