KCR Vs PK: ఏపీలోకి కేసీఆర్..తెలంగాణలోకి పవన్.. “కాపు” కాసేదెవరికి..!
KCR Vs Pawan Kalyan strategic steps in Telugu states to own Kapu Vote Bank: తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కొత్త వ్యూహాలు తెర మీదకు వస్తున్నాయి. ఇప్పటి వరకు ఏపీలో బీఆర్ఎస్ విస్తరణ పేరుతో కాపు సామాజిక వర్గం పైన కేసీఆర్ గురి పెట్టారు. టీడీపీ..జనసేన పొత్తు వేళ ఏపీలో కాపు వర్గానికి సీఎం పదవి నినాదంతో బీఆర్ఎస్ ముందుకు వెళ్లాలని నిర్ణయించింది. ఇప్పటికే జనసేనకు చెందిన కాపు నేతలకు బీఆర్ఎస్ లో ప్రాధాన్యత ఇవ్వటం ద్వారా కేసీఆర్ లక్ష్యం ఏంటో స్పష్టమవుతోంది. ఈ సమయంలోనే పవన్ కల్యాణ్ తెలంగాణలో ఎంట్రీ ఇచ్చారు. పవన్ ఉండేది హైదరాబాద్ అయినా, నేడు కొండగట్టులో వారాహి కి పూజలతో పాటుగా పార్టీ నేతలతో సమావేశం ఏర్పాటు చేసారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలోనూ పోటీకి పవన్ సిద్దం అవుతున్నారు.
ఏపీలో కాపు వర్గం పైన కేసీఆర్ ఫోకస్ చేయటం రాజకీయ వ్యూహంలో భాగంగానే కనిపిస్తోంది. ఏపీలో గతం కంటే భిన్నంగా కాపు సామాజిక వర్గం రానున్న ఎన్నికల్లో కీలకం అవుతోంది. ఇప్పుడు టీడీపీ..జనసేన పొత్తుతో కాపు మెజార్టీ ఓట్ బ్యాంక్ ఈ రెండు పార్టీలకు టర్న్ అవుతుందనే అంచనాలు ఉన్నాయి. 2019 ఎన్నికల్లో కాపు మెజార్టీ ఓటింగ్ వైసీపీకి అనుకూలంగా జరిగింది. ఫలితంగా ఉభయ గోదావరి జిల్లాల్లో ఆరు స్థానాలు మినహా మిగిలినవి వైసీపీ దక్కించుకుంది. ఏపీలో అధికారం దక్కాలంటే కీలకమైన ఉభయ గోదావరి జిల్లాల్లో టీడీపీ..జనసేన పొత్తు వైసీపీకి చెక్ పెట్టేదిగా కనిపిస్తోంది. ఈ సమయంలోనే బీఆర్ఎస్ ద్వారా కేసీఆర్ ఏపీలోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమయ్యారు. ఇప్పటికే ఏపీ సారధ్య బాధ్యతలను నాటి పవన్ కల్యాణ్ రైట్ హ్యాండ్ తోట చంద్రశేఖర్ కు అప్పగించారు.
వచ్చే నెల తొలి వారంలో ఏపీలో కేసీఆర్ పర్యటనకు రానున్నారు. ఇటు కాపు నేతలు కొంత కాలంగా వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు పవన్..చంద్రబాబు పొత్తుతో పాటుగా బీఆర్ఎస్ కాపులకు ఇస్తున్న ప్రాధాన్యత పైనా చర్చలు చేసారు. ఏపీలో బీఆర్ఎస్ కాపులకు సీఎం పదవి అనే నినాదం ప్రభావం ఉంటుందా, కాపు ఓటింగ్ టర్న్ అయ్యే అవకాశం ఉంటుందా అనే అంశాల పైన చర్చలు చేసారు. అదే సమయంలో, టీడీపీతో పొత్తు ద్వారా పవన్ కు దక్కే ప్రయోజనం ఏంటి..పవర్ షేరింగ్ లో ఇచ్చే ప్రాధాన్యత గురించీ చర్చించారు. అసలు కాపులు ప్రస్తుతం ఎవరికి అనుకూలంగా ఉన్నారనే అంశం పైన భిన్నాభిప్రాయలు వ్యక్తం అయ్యాయి. ఇప్పుడు ఇదే సమయంలో తమకు అనుకూలంగా ఉన్న ఓట్ బ్యాంక్ పైన కేసీఆర్ గురి పెట్టటంతో, పవన్ తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఎంట్రీ ఇస్తున్నారు. బీజేపీలో మున్నూరు కాపు వర్గానికి చెందిన నేతలు కీలక పదవుల్లో ఉన్నారు.
దీనికి కౌంటర్ గా తాజాగా చేసిన నియామకాల్లోనూ అదే వర్గానికి చెందిన వారికి ప్రాధాన్యత ఇచ్చారు. ఇప్పుడు పవన్ కల్యాణ్ రానున్న తెలంగాణ ఎన్నికల్లో తన పార్టీకి బరిలోకి దింపే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీతో పొత్తు ఉన్నా గ్రేటర్ ఎన్నికల్లో జనసేన కమలం పార్టీ అభ్యర్ధనతో పోటీకి దూరంగా ఉంది. ఇప్పుడు బీజేపీతో పొత్తు పై డైలమా కొనసాగుతోంది. టీడీపీ తిరిగి తెలంగాణలో తన బలం చాటుకొనే ప్రయత్నం చేస్తోంది. అటు ఏపీలో కేసీఆర్ తమకు నష్టం చేసేలా భావిస్తున్నారనే అభిప్రాయంతో ఉన్న టీడీపీ..జనసేన తెలంగాణలో కేసీఆర్ ఓట్ బ్యాంక్ కు గండి కొట్టేందుకు సిద్దం అవుతున్నారు. ఏపీలో కేసీఆర్ పర్యటన..బీఆర్ఎస్ లో చేరికల తరువాతనే మరింత స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఆ తరువాతనే తెలంగాణలో చంద్రబాబు..పవన్ వ్యూహాల పైన క్లారిటీ రానుంది. అయితే, ఏపీలో కేసీఆర్..తెలంగాణలో పవన్ ప్రభావం ఎంత వరకు అనేదే అసలు ప్రశ్న. దీనికి రానున్న రోజుల్లో చోటు చేసుకొనే పరిణామాలే సమాధానం చెప్పాలి.