CMKCR: నేను ముసలోన్నవుతుంటే పోచారం యువకుడిలా మారుతున్నాడు ..సీఎం కేసీఆర్
CMKCR: సీఎం కేసీఆర్ బుధవారం కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం తిమ్మాపూర్‌లోని టీటీడీ ఆలయ బ్రహ్మోత్సవాలు, వేంకటేశ్వర స్వామి కల్యాణోత్సవానికి సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ..ఆలయ అభివృద్ధికి రూ. 7 కోట్ల నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ఆలయ అభివృద్ధి కోసం ఇప్పటికే రూ.23 కోట్లు కేటాయించినట్లు స్పీకర్ పోచారం శ్రీనివాస్ చెప్పారని దానికి అదనంగా మరో రూ.7 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు..
స్పీకర్ పోచారంకు వయసైపోయిందని అంటున్నారు. కానీ ఆయన బాన్సువాడ అభివృద్ధి కోసం యువకుడిలా పనిచేస్తున్నారు. నేనూ ముసలోణ్ని అవుతున్నా..నాకు 69 ఏళ్లు వచ్చినయ్. నేనున్నన్ని రోజులు పోచారం ఉండాల్సిందే. బాన్సువాడ ప్రజలకు నిరంతర సేవ చేయాల్సిందే అనడంతో సభ అంత నవ్వులు విరిశాయి. గతంలో తాను తిమ్మాపూర్‌కు వచ్చినప్పుడు వెంకటేశ్వస్వామి గుడి ఒక మాదిరిగా ఉండేదని గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు ఆలయం చుట్టూ పొలాలు, చెరువుతో ఆహ్లాదకరంగా మారిందని అన్నారు. తిమ్మాపూర్ శ్రీనివాసుడి దయ బాన్సువాడతో పాటు యావత్ తెలంగాణ ప్రజలపై ఉండాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు.
తన నియోజకవర్గ అభివృద్ధి, అవసరాల కోసం పోచారం శ్రీనివాస్ రెడ్డి చిన్నపిల్లాడిలా కొట్లాడుతాడన్నారు. బాన్సువాడకు పోచారం సేవలు అవసరమని.. వయసు పైబడుతున్నా ఆయన్ను వదిలేది లేదని అన్నారు. నిజాంసాగర్ ప్రాజెక్టుకు సింగూరు నీటిని విడుదల చేయాలంటూ గతంలో స్పీకర్ పోచారం శ్రీనివా్‌సరెడ్డి నిజామాబాద్ కలెక్టరేట్ వద్ద దీక్షకు పూనుకోగా.. దానికి తాను సైతం హాజరయ్యానని కేసీఆర్ గుర్తు చేసారు.