Rain Alert: తెలంగాణలో వరుణుడి ప్రతాపం, వాతావరణ శాఖ కీలక సూచనలు, హెచ్చరికలు
తెలంగాణ రాష్ట్రాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తెలంగాణలో చాలా జిల్లాలు తడిసిముద్దవుతున్నాయి. జన జీవనం అస్తవ్యస్తం అవుతోంది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తోంది. కొన్ని సూచనలు, హెచ్చరికలు జారీ చేస్తోంది.
తెలంగాణలో రాగల 3 రోజుల వరకు వాతావరణ హెచ్చరికలు
నిన్న దక్షిణ ఒరిస్సా-ఉత్తర ఆంధ్రప్రదేశ్, దాని పరిసర ప్రాంతాల్లో ఉన్న అల్పపీడనం ఈ రోజు తీవ్ర అల్పపీడనంగా బలపడి ఒరిస్సా తీరం, పరిసర ప్రాంతంలో కేంద్రీకృతమై ఉంది. ఈ అల్పపీడనానికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుంచి 7.6కిమీ వరకు విస్తరించి ఎత్తుకు వెళ్లే కొలదీ నైరుతి దిశగా వంపు తిరిగి ఉంది.
నిన్నటి ఉపరితల ఆవర్తనం మరియు ఈస్ట్ వెస్ట్ షీర్ జోన్ ఈ రోజు 20 డిగ్రీల N వెంబడి సగటు సముద్రం మట్టంకి 3.1కిలోమీటర్లు నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉత్తర ద్వీపకల్ప భారతదేశం అంతటా వ్యాపించి ఎత్తుకి వెళ్లే కొలదీ దక్షిణం వైపుకి వంపు తిరిగి ఉంది.
ఈ రోజు రుతు పవన్ ద్రోణి జైసాల్మీర్, కోట, మాండ్ల, రాయిపూర్, ఝార్సిగూడ, తీవ్ర అల్పపీడన మధ్యభాగం మీదుగా ఆగ్నేయ దిశగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది.
రేపు, ఎల్లుండు ఎలా ఉండనుందంటే..
వాతావరణ శాఖ కొన్ని సూచనలు, హెచ్చరికలు చేసింది. తాజాగా బులెటెన్ విడుదల చేసింది. ఆ బులెటెన్ వివరాల ప్రకారం, ఈ రోజు మధ్యాహ్నం నుంచి రేపు ఉదయం 8.30 వరకు వాతావరణం ఎలా ఉండ నుందో బులెటెన్‌లో తెలిపింది. తెలంగాణలో అనేక చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. ఆదిలాబాద్, కుమురం భీమ్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాలలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది.
జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్ జిల్లాలలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.