Vande Bharat Express: ప్రమాదానికి గురైన వందే భారత్ ఎక్స్‌ప్రెస్
Vande Bharat Express: వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కు పెను ప్రమాదం తప్పింది. ఖమ్మం జిల్లాలో వందే భారత్ రైలు ఓ ఎద్దును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రైలు ముందు భాగం దెబ్బతింది. వెంటనే అప్రమత్తమైన రైల్వే సిబ్బంది.. రైలును ఘటనాస్థలంలోనే నిలిపివేసి మరమ్మతు చేపట్టారు. శనివారం మధ్యాహ్నం సమయంలో సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం బయల్దేరిన ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగులవంచ రైల్వే స్టేషన్ సమీపంలోకి రాగానే ట్రాక్ పైకి వచ్చిన ఎద్దును ఢీకొంది. ఢీ కొట్టడంతో రైలు ముందు భాగం దెబ్బతినడంతో పైలట్ అధికారులకు సమాచారమిచ్చారు. వెంటనే స్పందించిన అధికారులు రైలును నిలిపివేశారు.
ఈ రైలు రాత్రి 11.30 గంటలకు విశాఖ చేరుకోవాల్సి ఉండగా.. ఈ ప్రమాదం కారణంగా సుమారు గంటన్నర ఆలస్యం గా చేరుకుంది. కిందటి ఏడాది అక్టోబర్‌లో గుజరాత్‌లోని అహ్మదాబాద్ సమీపంలో వందే భారత్ రైలు.. గేదెలను ఢీకొట్టి ప్రమాదానికి గురైంది. కాగా ఈ మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్ పై రాళ్లదాడి కూడా జరగడం గమనార్హం. గతనెలలో ఖమ్మం జిల్లాలోనే గుర్తుతెలియని దుండగులు ఈ రైలుపై రాళ్లదాడి చేసారు.