Tsrtc: రూ.116 చెల్లిస్తే ఇంటికే రాములోరి తలంబ్రాలు..టీఎస్‌ఆర్టీసీ
Tsrtc: శ్రీరామ నవమి సందర్భంగా భద్రాద్రిలో జరిగే శ్రీ సీతారాముల కల్యాణోత్సవ తలంబ్రాలను భక్తులకు అందజేయాలని టీఎస్‌ఆర్టీసీ నిర్ణయించింది. గత ఏడాది మాదిరిగానే ఈ సారి కూడా తెలంగాణ దేవాదాయ శాఖ సహకారంతో రాములోరి కల్యాణ తలంబ్రాలను భక్తుల ఇళ్లకు చేరవేసేందుకు సన్నద్దమవుతోంది. భక్తుల ఇండ్ల వద్దకే తలంబ్రాలను అందించనున్నట్టు సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. ఈ మేరకు కల్యాణ తలంబ్రాలను భక్తులకు అందించే బుకింగ్ పోర్టల్‌ను బుధవారం ఆయన ఆవిష్కరించారు.
అనంతరం సజ్జనార్ మాట్లాడుతూ టీఎస్‌ఆర్టీసీ గతేడాదిలాగానే ఈ సారి కూడా దేవాదాయశాఖ సహకారంతో రాములోరి కల్యాణ తలంబ్రాలను భక్తుల ఇండ్లకు చేరవేసేయనున్నట్టు తెలిపారు. భక్తులు ఆర్టీసీ కార్గో పార్సిల్ కేంద్రాల్లో రూ.116 చెల్లించి, వివరాలను నమోదు చేసుకోవాలని తెలిపారు. నిరుడు దాదాపు 89 వేల మంది భక్తులకు తలంబ్రాలను అందజేశామని, రూ.71 లక్షల రాబడి వచ్చిందని వివరించారు. ఈ సేవలను వినియోగించుకోవాలనుకునేవారు టీఎస్‌ఆర్టీసీ లాజిస్టిక్స్ విభాగం ఫోన్ నంబర్లు 9177683134, 7382924900, 91546 80020ను సంప్రదించాలని తెలిపారు.