పార్లమెంట్ నుంచి టీఆర్ఎస్ వాకౌట్..
పార్లమెంట్ నుంచి టీఆర్ఎస్ సభ్యులు వాకౌట్ చేశారు. ఎస్పీ వర్గీకరణ పై చర్చ ను కోరుతూ ఇచ్చిన నోటీసులు అనుమతించనందుకు నిరసనగా టీఆర్ఎస్ సభ్యులు వాకౌట్ చేశారు. ఆ తర్వాత నామా నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణపై నోటీసు ఇచ్చామని, సభలో మాట్లాడే అవకాశం ఇవ్వాలని కోరామని అన్నారు. ఎస్సి వర్గీకరణలో జనాభా ప్రాతిపదికన విభజన జరగాలని కోరామని వెల్లడించారు. 2014 లో తెలంగాణ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపామని, కేంద్రానికి తీర్మానం పంపి ఎనిమిదేళ్ళయింది కానీ ఇన్నేళ్ళుగా తీర్మానాన్ని అణగదొక్కిందని అన్నారు. బిజెపి నేతలు వంద రోజుల్లో వర్గీకరణ చేస్తామని వాగ్దానాలు చేశారు కదా అధికారం కేంద్రం వద్ద ఉంది, మీరు చేయక పోతే అధికారం మాకివ్వండని అన్నారు. బిజెపి దళితులతో ఆడుకుంటుందని విమర్శించిన ఆయన దళితులపై చిత్తశుద్ధి ఉంటే, దళిత బంధును దేశవ్యాప్తంగా అమలు చెయ్యాలని అన్నారు. ఎంపీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణపై, తీర్మానం చేసినప్పుడు కిషన్ రెడ్డి అసెంబ్లీలో ఉన్నాడని, ఇప్పుడెందుకు నోరు మూసుకున్నారని ప్రశ్నించాడు. బిజెపి నేతలకు దళితులు బుద్ధి చెప్తారని అన్నారు.