గవర్నర్ ఉగాది ఉత్సవాలకు టీఆర్ఎస్ డుమ్మా..
తెలంగాణలో గవర్నర్- అధికార పార్టీ మధ్య వున్న విభేదాలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. ఉగాది పర్వ దినం పురస్కరించుకుని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాజ్‌భవన్‌లో ఉగాది వేడుకలు ఏర్పాటు చేశారు. అయితే సీఎం కేసీఆర్ ఈ కార్యక్రమానికి దూరంగా వున్నారు. ఆయన మాత్రమే కాదు టీఆర్ఎస్ నేతలు కూడా ఈ వేడుకలో ఎక్కడా కనిపించకపోవడం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. నిజానికి తొలుత రాజ్‌భవన్ లో జరిగిన రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు కాలేదు. అలాగే, రాష్ట్ర మంత్రులు కూడా ఎవరూ హాజరు కాలేదు. అలాగే ఇటీవల జరిగిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కూడా సాంప్రదాయానికి విరుద్ధంగా గవర్నర్ ప్రసంగం లేకుండానే జరిగియి. అంతేకాక కొద్ది రోజుల క్రితం హన్మకొండ జిల్లాకు వెళ్ళిన తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పర్యటనలో ప్రోటోకాల్ వివాదం చోటు చేసుకుంది. ఆమెకు స్వాగతం పలికేందుకు ప్రజా ప్రతినిధులెవ్వరూ రాలేదు. ప్రోటోకాల్ ప్రకారం స్వాగతం పలికేందుకు గ్రేటర్ వరంగల్ మేయర్ హాజరు కాలేదు. మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా కనపడక పోవడంతో అప్పుడు కూడా హాట్ హాట్ అయింది. గవర్నర్ మేడారం పర్యటనలోనూ ప్రోటోకాల్ వివాదం రాజుకుంది. ఈ వ్యవహారం ఎంత దూరం వెళుతుంది అనేది చూడాలి మరి.