Telangana Congress: కాంగ్రెస్ పొత్తుల లెక్కలు లెక్కలు బయట పెట్టిన రేవంత్ రెడ్డి
Telangana Congress: తెలంగాణలో ఒకప్పుడు టిఆర్ఎస్కు గట్టి ప్రత్యర్థిగా కాంగ్రెస్ ఉండేది కానీ కెసిఆర్ ఫోకస్ కాంగ్రెస్ మీద పడడంతో బలమైన నేతలు అందరూ ఆయన గూటికి చేరారు. కేసీఆర్ తో మసలలేము అనుకున్నవారు మాత్రమే ప్రస్తుతానికి కాంగ్రెస్ లో ఉన్నారు. ఈ నేపద్యంలో కాంగ్రెస్లో ఉన్న నేతలు ఎలా అయినా పార్టీని అధికారంలోకి తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారు. అయితే పార్టీలో ఉన్న వర్గ విభేదాలు ఆధిపత్య పోరు, అంతర్గత కుమ్ములాటలు ఇలా సమస్యలు అనేకం ఉండడంతో పార్టీ గతంలో కంటే ఇప్పుడు బలహీన పడింది. రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎప్పటికప్పుడు అంతర్గత విభేదాలు బయటకు వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జగ్గారెడ్డి, ఉత్తంకుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క సహా చాలా మంది సీనియర్ నాయకులు రేవంత్ కి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున మీడియా ముందుకు వచ్చి సంచలన వ్యాఖ్యలు చేసిన దాఖలాలు ఉన్నాయి. ఇన్ని విభేదాలు కారణంగానే కాంగ్రెస్కు కంచుకోటగా ఉన్న మునుగోడు లాంటి నియోజకవర్గం వదులుకోవాల్సి వచ్చింది. ఇలాగే కొనసాగితే కాంగ్రెస్ ఉనికే ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యంలో ఎలా అయినా కాంగ్రెస్ పార్టీకి నూతన జవసత్వాలు తీసుకురావాలని రేవంత్ రెడ్డి హాత్ సే హాత్ జోడో యాత్ర అంటూ ఒక పాదయాత్ర మొదలుపెట్టారు ఈ పాదయాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన కూడా లభిస్తోంది అని కాంగ్రెస్ చెప్పుకుంటుంది. కానీ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పొత్తు సహా కీలక అంశాల మీద రేవంత్ రెడ్డి కామెంట్స్ చేశారు. తెలంగాణలో వామపక్షాలతో కాంగ్రెస్ అధిష్టానం పొత్తు పెట్టుకునే విషయం మీద చర్చలు జరుపుతున్నట్లుగా రేవంత్ వెల్లడించారు. అలాగే తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీ చేసే అవకాశం అయితే లేదని వెల్లడించారు. ఇక కాంగ్రెస్ను పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకు వెళ్ళే ఉద్దేశంలో ఈనెల 8వ తేదీన కాంగ్రెస్ కరీంనగర్ లో ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ సభను భారీ ఎత్తున జన సమీకరణ చేసేందుకు యత్నిస్తున్నారు. అంతేకాదు ఈ సభకు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులను ముఖ్య అతిథులుగా ఆహ్వానించాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ సభలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అమలవుతున్న సంక్షేమ పథకాలు గురించి, తెలంగాణ ప్రజలకు వివరించాలని, రాబోయే రోజుల్లో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇదే రకమైన పతకాలను అమలు చేస్తామని అనౌన్స్ చేయబోతున్నారు అని అంటున్నారు. ఈ సభలోనే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులతో పాటు, వివిధ రాష్ట్రాల పిసిసి అధ్యక్షులు తోను మాట్లాడించబోతున్నారని తెలుస్తోంది. తెలంగాణలోని పార్టీ కీలక నాయకులు అందరితోనూ పాదయాత్రలు చేయించి రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చే విధంగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తోందని అందులో భాగంగానే ఒకపక్క రేవంత్ రెడ్డి మరో పక్క ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంకో పక్క మహేశ్వర్ రెడ్డి పాదయాత్రలు చేస్తున్నారని తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరగబోతోంది అనేది.