ఉమ్మడి ఖమ్మం రాజకీయాల్లో (Khammam Politics) తిరుగులేని నేత.. 40 ఏళ్లుగా ఖమ్మం రాజకీయాల్లో కీలక శక్తిగా వ్యవహరిస్తున్న నాయకుడు.. నాలుగైదు నియోజకవర్గాల్లో ప్రభావం చూపగల సత్తా ఉన్న మొనగాడు.. తుమ్మల నాగేశ్వరరావు (Thummala Nageswara Rao).
Thummala: ఉమ్మడి ఖమ్మం రాజకీయాల్లో (Khammam Politics) తిరుగులేని నేత.. 40 ఏళ్లుగా ఖమ్మం రాజకీయాల్లో కీలక శక్తిగా వ్యవహరిస్తున్న నాయకుడు.. నాలుగైదు నియోజకవర్గాల్లో ప్రభావం చూపగల సత్తా ఉన్న మొనగాడు.. తుమ్మల నాగేశ్వరరావు (Thummala Nageswara Rao). ప్రస్తుతం తుమ్మల పొలిటికల్ చౌరస్తాలో నిలబడ్డారు. ఆయన ఎటువైపు అడగులేస్తారనేది ఆసక్తికరంగా మారింది. అటు తుమ్మలకు అపన్నహస్తం అందించేందుకు కాంగ్రెస్ రెడీగా ఉంది. ఆయన అనుచరులు కూడా పార్టీ మారాలని.. గెలిపించుకొని తీరుతామని చెబుతున్నారు. ఈక్రమంలో తుమ్మల పార్టీ మారుతారా?.. కాంగ్రెస్‌లో చేరుతారా? అనేది చర్చనీయాంశంగా మారింది.
టీడీపీ హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు తుమ్మల మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 2014లో బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. సీఎం కేసీఆర్.. తుమ్మలను ఎమ్మెల్సీ చేశారు. కేబినెట్‌లోకి కూడా తీసుకొని మంత్రి పదవి కట్టబెట్టారు. ఆ తర్వాత తుమ్మల పాలేరు బై ఎలక్షన్స్‌లో బరిలోకి దిగి విజయం సాధించారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ పాలేరు నుంచి పోటీ చేశారు. కానీ ఈసారి ఓటమిపాలయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థి ఉపేందర్ రెడ్డి చేతిలో తుమ్మల ఓడిపోయారు.
ఆ తర్వాత కొద్దిరోజులకు ఉపేందర్ రెడ్డి గులాబీ పార్టీలో చేరిపోయారు. అప్పటి నుంచి తుమ్మల కాస్త అసంతృప్తితో ఉన్నారు. అదే సమయంలో బీఆర్ఎస్‌లో కూడా తన ప్రభావం తగ్గుతూ వచ్చింది. కానీ ఉమ్మడి ఖమ్మం రాజకీయాల్లో మాత్రం ఆయన పట్టు కోల్పోలేదు. తన క్యాడర్‌ను కాపాడుతూ వచ్చారు. ఇక ఈసారి కూడా టికెట్ తనకే వస్తుందని ఇన్నిరోజులు తుమ్మల గట్టి నమ్మకంతో ఉన్నారు. కానీ కేసీఆర్ తుమ్మలను పక్కనపెట్టేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డికి టికెట్ కేటాయించారు.
దీంతో అటు తుమ్మలతో పాటు ఆయన అనుచరులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పార్టీ మారాలని ఆయన అనుచరులు తుమ్మలకు సూచిస్తున్నారు. పాలేరు నుంచి పోటీ చేయాలని.. ఎట్టి పరిస్థితిలోనూ గెలిపించుకొని తీరుతామని చెబుతున్నారు. అటు కాంగ్రెస్ కూడా తుమ్మలను తమ పార్టీలో జాయిన్ చేసుకునేందుకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే రేణుకా చౌదరి.. తుమ్మల కాంగ్రెస్‌లోకి వస్తే ఆహ్వారనిస్తామని ప్రకటించారు. అంతేకాకుండా తమ పార్టీలోకి వస్తే పాలేరు లేదా ఖమ్మం నుంచి బరిలోకి దింపుతామని కాంగ్రెస్ ఆఫర్లు గుప్పించిందట.
అయితే తుమ్మల మాత్రం చివరి ప్రయత్నంగా మరోసారి కేసీఆర్‌ను కలిసే అవకాశం ఉందని తెలుస్తోంది. కేసీఆర్‌ను కలిసి మరోసారి ఎమ్మెల్సీ అవకాశం అయినా ఇవ్వాలని అడుగనున్నారట. కేసీఆర్ కూడా తనకు కచ్చితంగా ఎమ్మెల్సీ టికెట్ ఇస్తారని తుమ్మల ఆశతో ఎదురు చూస్తున్నారట. మరి కేసీఆర్ ఎమ్మెల్సీ పదవి అయినా తుమ్మలకు కట్టబెడుతారా?.. లేదా? అనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ అప్పుడు కూడా నిరాశే ఎదురయితే తుమ్మల ఏ నిర్ణయం తీసుకుంటారు?.. కాంగ్రెస్‌లో చేరుతారా? అనేది చర్చనీయాంశంగా మారింది.