పేదలకు సాయం అందించడం మానేసి జేబు దొంగలా దోచుకుంటున్నారు..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా వల్ల ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ప్రజలపై కేంద్ర ప్రభుత్వం, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచి వారిని కొలుకోకుండా చేస్తుంటే.. రాష్ట్ర ప్రభుత్వం వారిపై మరో భారం వేసిందన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం యూనిట్‌కు 50 పైసల నుంచి రూపాయి వరకు పెంచి ప్రజలపై ఏడాదికి 10 నుంచి 12 వేల కోట్ల భారం వేసిందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను జేబు దొంగల మాదిరిగా దోచుకుంటున్నారని మండిపడ్డారు. కరోనా వల్ల ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న తమకు ప్రభుత్వం నుంచి ఏమైనా సహకారం అందుతుందేమో అని ఎదురు చూస్తున్న ప్రజలపై ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తుందన్నారు.
నరేంద్ర మోడీ, కేసీఆర్ ఇరువురు ప్రజలను దోచుకుంటూ ఒకరి తప్పును ఇంకొకరు కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. టీఆర్‌ఎస్ వల్ల రైతులు ధాన్యం విషయంలో అయోమయంలో పడ్డారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు చేయాలన్న రేవంత్.. గతంలో రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ సంస్థలకు చెల్లించాల్సిన 12500 కోట్ల రూపాయలను సత్వరమే చెల్లించాలని రేవంత్ డిమాండ్ చేశారు.
కేసీఆర్ బ్రతికి ఉన్నంత వరకూ రైతులకు నష్టం రానివ్వనన్నారని, ఇప్పుడు కేసీఆర్ బ్రతికి ఉండగానే రైతులకు నష్టం వస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనకపోతే కేసీఆర్ జంతర్ మంతర్ దగ్గర దీక్ష చేస్తారా అని ప్రశ్నించారు. సీఎం జంతర్ మంతర్ వద్ద రైతుల కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తానంటే కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేస్తుందన్నారు. రైతుల మీద ప్రేమ ఉందని చెప్పుకునే కేసీఆర్.. కేటీఆర్, హరీష్ రావును తీసుకొని ఢిల్లీకి ఎందుకు పోలేదని ప్రశ్నించారు. కేసీఆర్ నేరుగా ప్రధానిని కలిస్తే ఈ పంచాయతీ ఉండదన్నారు.