TS Govt Vs Govnr: రాజ్ భవన్ వర్సస్ ప్రగతి భవన్ యుద్దం ముదురుతోంది..!
Governor Versus State Govt battle is raging in Telangana : తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి కేసీఆర్ మధ్య యుద్ధం మరింత తీవ్రరూపం దాల్చింది. ఎంతలా అంటే.. దేశ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజును కూడా ఉత్సవంగా జరుపుకోలేనంతగా! అవును.. ఈసారి ప్రభుత్వ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు జరగడంలేదు.గవర్నర్ కార్యాలయమైన రాజ్‌భవన్ కే పరిమితమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. వాస్తవానికి ప్రతిఏటా పబ్లిక్ గార్డెన్‌లో ఈ వేడుకలను ప్రజల మధ్య నిర్వహించడం ఆనవాయితీ. గవర్నర్ చేతులమీదుగా జరిగే జాతీయ పతాకావిష్కరణకు ముఖ్యమంత్రి, మంత్రులు, ఇతర ప్రముఖులు హాజరవుతుంటారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అందజేసిన ప్రసంగ కాపీని గవర్నర్ చదువుతుంటారు. 2020 దాకా ఇలాగే జరిగాయి. అంతకుముందు గవర్నర్ గా ఉన్న ఈఎస్ ఎల్ నరసింహన్‌తో కేసీఆర్‌కు సత్సంబంధాలుండడంతో గణతంత్ర దినోత్సవ వేడుకలను ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహించింది.
2019లో నరసింహన్ పదవీకాలం పూర్తయి.. తమిళిసై సౌందరరాజన్ గవర్నర్ గా వచ్చారు. తొలొనాళ్లలో తమిళిసైతోనూ కేసీఆర్‌కు సత్సంబంధాలే ఉన్నాయి. దీంతో 2020 జనవరి 26న జరిగిన రిపబ్లిక్ డే వేడుకలను పబ్లిక్ గార్డెన్‌లోనే నిర్వహించారు. ఇందుకోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. అయతే ఆ తరువాత పాడి కౌశిక్ రెడ్డికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవిని తమిళిసై నిరాకరించిన ఘటనతో రాజ్‌భవన్‌కు, ప్రగతి భవన్‌కు మధ్య విభేదాలకు బీజం పడింది. అప్పటినుంచి ప్రతి విషయంలోనూ ఇవి బహిర్గతమవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో 2021లో కరోనా వ్యాప్తి చెందడంతో గణతంత్ర దినోత్సవ వేడుకలను రాజ్‌భవన్‌లో కొద్దిమంది సమక్షంలో నిర్వహించారు. ముఖ్యమంత్రి సహా ఎవరూ హాజరు కాలేదు. అయితే ఇందుకు కరోనాను కారణంగా చూపడంతో పెద్దగా ఎవరూ ఈ విషయాన్ని పట్టించుకోలేదు. కానీ, 2022 జననరి 26 వచ్చేటప్పటికి గవర్నర్‌కు , ప్రభుత్వానికి అంతరం మరింత పెరిగింది.
గవర్నర్ పర్యటనలకు ప్రొటోకాల్ పాటించకపోవడం దగ్గర్నుంచి చివరికి అసెంబ్లీ సమావేశాలను కూడా గవర్నర్ ప్రసంగం లేకుండానే కేసీఆర్ ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఇందుకోసం వ్యూహాత్మకంగా శాసనసభను ప్రొరోగ్ చేయకుండానే ముగిస్తోంది. ఆఖరుకు బడ్జెట్ సమావేశాలను కూడా గవర్నర్ లేకుండానే జరుపుతోంది. ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించడం, ఆ ప్రసంగానికి సభ ధన్యవాద తీర్మానం చేయడం వంటివి సాధారణంగా జరరాల్సి ఉన్నా.. కేసీఆర్ సర్కారు వాటన్నింటినీ పక్కన పెట్టేస్తోంది. ఈ క్రమంలోనే 2022 గణతంత్ర దినోత్సవ వేడుకలకు కూడా గవర్నర్‌తో కలిసి హాజరు కాకూడదని కేసీర్ సర్కారు నిర్ణయించుకుంది. అప్పటికి కరోనా చాలా వరకు తగ్గుముఖం పట్టి.. సభలు, సమావేశాలు కూడా జరుగుతున్నా.. కరోనా కారణంగా పబ్లిక్ గార్డెన్‌లో వేడుకలు నిర్వహించలేమని ప్రకటించింది.
దీంతో మరోసారి రాజ్‌భవన్‌కే గణతంత్ర దినోత్సవం పరిమితమైంది. ఇక ఈసారి ఏ కారణం లేకపోయినా.. రిపబ్లిక్ డే నిర్వహించే్ందుకు ప్రభుత్వం ఎటువంటి ఏర్పాట్లు చేయడంలేదు. గవర్నర్ కార్యలయానికి ఏ సమాచారమూ అందించలేదు. ప్రభుత్వం తరపున అందించే ప్రసంగ కాపీని కూడా పంపలేదు. దీంతో తాము దూరంగా ఉంటున్నట్లు చెప్పకనే చెబుతోంది. మరోవైపు గవర్నర్ కార్యాలయం కూడా రాజ్‌భవన్‌లో వేడుకలు నిర్వహించేందు ఏర్పాటు చేస్తోంది. రెండు పరిపాలనా కేంద్రాల మధ్య పెరిగిపోతున్న ఈ అంతరం ఇంకా ఎక్కడిదాకా దారి తీస్తుందో చూడాల్సి ఉంది.